మన శరీరానికి అవసరమయ్యే అనేక విటమిన్లలో విటమిన్ ఎ కూడా ఒకటి. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. అంటే.. కొవ్వుల్లో కరుగుతుంది. మన శరీరంలో అనేక రకాల చర్యలకు విటమిన్ ఎ అవసరం అవుతుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది.
మనకు విటమిన్ ఎ రెండు రకాలుగా ఆహారాల్లో లభిస్తుంది. ఒకటి విటమిన్ ఎ. రెండోది ప్రొ విటమిన్ ఎ.
మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో ప్రీ ఫార్మ్‌డ్ విటమిన్ ఎ ఉంటుంది. ఇది నేరుగా మనకు లభిస్తుంది. అలాగే కూరగాయలు, ఆకుకూరలు, పలు పండ్లలో కెరోటినాయిడ్స్ ఉంటాయి. వీటిని మన శరీరం విటమిన్ ఎ కింద మారుస్తుంది. అనంతరం ఆ విటమిన్‌ను శరీరం ఉపయోగించుకుంటుంది.
అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలకు విటమిన్ ఎ లోపం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో చాలా మంది ప్రజలు విటమిన్ ఎ లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, శిశువులు, చిన్నారుల్లో విటమిన్ ఎ లోపం వస్తోంది. అలాగే సిస్టిక్ ఫైబ్రాసిస్, క్రానిక్ డయేరియా ఉన్నవారిలోనూ విటమిన్ ఎ లోపం వస్తుంటుంది.
విటమిన్ ఎ లోపం ఉందని చెప్పేందుకు మన శరీరంలో కనిపించే పలు సంకేతాలు, లక్షణాలు ఇవే..
చర్మ కణాలు కొత్తగా ఏర్పడేందుకు, ఆ కణాలకు మరమ్మత్తులు చేసేందుకు విటమిన్ ఎ ఉపయోగపడుతుంది. అలాగే చర్మానికి వచ్చే పలు వాపులను కూడా విటమిన్ ఎ తగ్గిస్తుంది. అయితే విటమిన్ ఎ తగినంత లేకపోతే ఎగ్జిమా లేదా ఇతర చర్మ సమస్యలు వస్తాయి. ఎగ్జిమా వల్ల చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. చర్మం వాపునకు గురవుతుంది. ఈ క్రమంలో వైద్యులు ఈ స్థితికి alitretinoin అనే మెడిసిన్‌తోపాటు విటమిన్ ఎ సప్లిమెంట్లను ఇస్తారు. దీంతో ఎగ్జిమా తగ్గుతుంది. అయితే పొడి చర్మం అనేది కేవలం విటమిన్ ఎ లోపం వల్ల మాత్రమే ఏర్పడదు. ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యల వల్ల కూడా పొడి చర్మం ఏర్పడుతుంది. కానీ విటమిన్ ఎ అనేది సమస్య అయితే ఈ విటమిన్ ను తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
విటమిన్ ఎ లోపం వల్ల కంటి సమస్యలు వస్తుంటాయి. వాటిల్లో కళ్లు పొడిబారడం ఒకటి. అలాగే సమస్య తీవ్రతరం అయితే అంధత్వం వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక ఈ సమస్య ఉన్నవారు విటమిన్ ఎ లోపం ఉందో, లేదో పరీక్షలు చేయించుకోవాలి. ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులను వాడాలి.
విటమిన్ ఎ లోపం మరీ ఎక్కువగా ఉంటే రేచీకటి సమస్య వస్తుంటుంది. ఇది కచ్చితంగా విటమిన్ ఎ లోపం వల్లే వస్తుంది కనుక నిత్యం విటమిన్ ఎ ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
స్త్రీ, పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే అందుకు విటమిన్ ఎ దోహడపడుతుంది. ఈ లోపం ఉన్న వారికి పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మహిళలల్లో విటమిన్ ఎ లోపం ఉంటే పిండం ఎదుగుదల సరిగ్గా ఉండదు. అలాగే శిశువులకు పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక కొన్ని సందర్భాల్లో మహిళలకు అబార్షన్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. పురుషుల్లో నాణ్యమైన శుక్రకణాలు ఉత్పత్తి కావాలంటే అందుకు విటమిన్ ఎ దోహదపడుతుంది. కనుక స్త్రీ, పురుషులిద్దరూ సంతాన లోపం ఉంటే దాన్ని విటమిన్ ఎ లోపంగా భావించవచ్చు. అయితే సంతాన లోపంకు ఇంకా వేరే ఇతర కారణాలు కూడా ఉంటాయి. కానీ విటమిన్ ఎ వల్లే అయితే ఈ విటమిన్‌ను వాడడం వల్ల సంతాన లోపం సమస్య పరిష్కారమవుతుంది.
చిన్నారుల్లో విటమిన్ ఎ లోపం ఉంటే వారి ఎదుగుదల సరిగ్గా ఉండదు. పిల్లలు సరిగ్గా ఎదగడం లేదని గుర్తిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించాలి. అందుకు అనుగుణంగా విటమిన్ ఎ ను నిత్యం చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విటమిన్ ఎ ఉండే ఆహారాలను కూడా ఇవ్వాలి. దీంతో పిల్లల్లో ఎదుగుదల లోపం ఉండకుండా చూడవచ్చు.
విటమిన్ ఎ లోపం ఉన్నవారిలో తరచూ గొంతు లేదా ఛాతిలో ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. విటమిన్ ఎ సప్లిమెంట్లను తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
డయాబెటిస్ ఉన్నవారిలో గాయాలు త్వరగా మానవు. అలాగే విటమిన్ ఎ లోపం ఉన్నా కూడా గాయాలు త్వరగా మానవు. కనుక ఈ లక్షణాన్ని గుర్తిస్తే.. అందుకు కారణం డయాబెటిస్ కాకపోతే విటమిన్ ఎ అని గుర్తించాలి. ఈ క్రమంలో వారు డాక్టర్ల సూచన మేరకు విటమిన్ ఎ సప్లిమెంట్లను వాడుకోవడంతోపాటు విటమిన్ ఎ ఉండే ఆహారాలను కూడా నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది
విటమిన్ ఎ తక్కువగా ఉన్నవారిలో మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. మొటిమల సమస్య ఉన్నవారు విటమిన్ ఎ సప్లిమెంట్లను తీసుకోవడం లేదా విటమిన్ ఎ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
గమనిక : విటమిన్ ఎ శరీరానికి మంచిదే అయినప్పటికీ లోపం ఉన్నవారే ట్యాబ్లెట్లను వాడాలి. అలా కాకుండా ఆరోగ్యవంతులు కూడా వాడితే వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కంటి చూపు సమస్య, వాపులు రావడం, చర్మం పొడిగా మారడం, నోటి అల్సర్లు, కంగారు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* 0 నుంచి 6 నెలల చిన్నారులకు – 400 మైక్రోగ్రాములు
* 7 నుంచి 12 నెలల వారికి – 500 మైక్రోగ్రాములు
* 1 నుంచి 3 ఏళ్ల వారికి – 300 మైక్రోగ్రాములు
* 4 నుంచి 8 ఏళ్ల వారికి – 400 మైక్రోగ్రాములు
* 9 నుంచి 13 ఏళ్ల వారికి – 600 మైక్రోగ్రాములు
* 14 నుంచి 18 ఏళ్ల వారికి (బాలురు) – 900 మైక్రోగ్రాములు
* 14 నుంచి 18 ఏళ్ల వారికి (బాలికలు) – 700 మైక్రోగ్రాములు
* పురుషులకు – 900 మైక్రోగ్రాములు
* స్త్రీలకు – 700 మైక్రోగ్రాములు
* గర్భిణీలకు – 770 మైక్రోగ్రాములు
* పాలిచ్చే తల్లులకు – 1300 మైక్రోగ్రాములు
పాలకూర, బ్రొకొలి, గ్రేప్ ఫ్రూట్, మిరపకాయలు, చీజ్, యాప్రికాట్స్, పిస్తాపప్పు, యాపిల్స్, క్యారెట్లు, కోడిగుడ్లు, అవకాడో, బొప్పాయి, చిలగడదుంపలు, చేపలు తదితర ఆహారాల్లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది.