Vitamin C : మన శరీర రోగ నిరోధక వ్యవస్థను చైతన్యం చేస్తూ హానికారక వైరస్ లు మన శరీరంలోకి ప్రవేశించకుండా చేయడంలో విటమిన్ సి ముఖ్య పాత్ర పోషిస్తుంది. గాయాలు త్వరగా మానడానికి విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్ సి ఎంతగానో సహాయపడుతుంది. కానీ ప్రస్తుత కాలంలో విటమిన్ సి లోపం సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం, పంటి నొప్పి, మానసిక ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ సి మన శరీరానికి సరిగ్గా అందకపోతే రక్తనాళాలు బలహీనపడి శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే సి విటమిన్ ని మన శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు. మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే సి విటమిన్ మన శరీరానికి అందుతుంది. విటమిన్ సి ఏయే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాల్లో ఉసిరికాయలు కూడా ఒకటి. 100 గ్రాముల ఉసిరికాయల్లో 900 మిల్లీ గ్రాముల సి విటమిన్ ఉంటుంది. కేవలం కొన్ని కాలాల్లోనే దొరికే ఈ ఉసిరికాయలను ముక్కలుగా కోసి ఎండబెట్టి సంవత్సరం అంతా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా వాడడం వల్ల కూడా ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి మనకు అందుతుంది.
అలాగే మనకు నిత్యం లభించే జామకాయల్లో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల జామకాయల్లో 220 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. జామకాయలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల విటమిన్ సి లోపం మన దరి చేరకుండా ఉంటుంది. అలాగే నిమ్మ, ద్రాక్ష, కమలా పండ్లు, ద్రాక్ష, ఫైనాపిల్, బొప్పాయి, మామిడి, బంగాళాదుంప, క్యాప్సికం, పాలకూర వంటి వాటిల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
పిల్లలకు రోజుకు 30 నుండి 50 మిల్లీ గ్రాముల విటమిన్ సి అవసరం అవుతుంది. అదే పెద్దవారికి అయితే 50 నుండి 60 మిల్లీ గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రోజుకు 100 నుండి 120 మిల్లీ గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. ఈ విధంగా విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ సి లభించి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.