Cholesterol : ప్రస్తుత తరుణంలో మనలో చాలా మంది శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో జీవిస్తున్నారు. ఈ కొవ్వు అనేది లైపో ప్రొటీన్ల సమూహం. వైద్యులు సాధారణంగా మన శరీరంలోని కొవ్వు శాతాన్ని లెక్కించడానికి మొత్తం కొవ్వు ఎంత లో డెన్సిటీ లైపో ప్రొటీన్లు ఎన్ని ( దీనినే వాడుక భాషలో ఎల్ డీ ఎల్ కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు), హై డెన్సిటీ లైపో ప్రొటీన్లు ఎన్ని ( దీనిని హెచ్ డీ ఎల్ కొలెస్ట్రాల్ లేదా మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు) మొదలైనవి పరీక్షిస్తారు. ఇక ఈ ఎల్ డీ ఎల్ కొలెస్ట్రాల్ మనకి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచడానికి కారణమవుతుంది. అయితే హెచ్ డీ ఎల్ కొలెస్ట్రాల్ మనల్ని రోగాల బారి నుండి కాపాడుతుంది.
మన రోజూ వారీ ఆహార పద్దతులు మన ఆరోగ్యాన్ని నిర్దేశిండంలో ముఖ్య భూమిక పోషిస్తాయి. మంచి ఆహార అలవాట్లు, నిరంతర వ్యాయామం, శరీర బరువుని అదుపులో ఉంచుకోవడం, ఇలాంటి వాటితో మన దేహంలో తయారయ్యే అధిక కొవ్వులను నియంత్రించవచ్చు. వీటితోపాటు మన వంటింట్లో లభించే కొన్ని పదార్థాలను కూడా శరీరంలోని అధిక కొవ్వులను తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.
వెల్లుల్లిని మనం ప్రతి రోజూ వంటింట్లో ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉంటాం. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో లక్షణాలు ఉంటాయి. వెల్లుల్లిలో అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఇంకా ఆర్గానో సల్ఫర్లు లాంటి పదార్థాల సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో ఉండే సల్ఫర్ మూలకాల వల్ల దీనికి ఔషధ గుణాలు సంక్రమిస్తాయి. అయితే ఎల్ డీ ఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో వెల్లుల్లి ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు బీపీని తగ్గించడంతోపాటు, రక్త ప్రసరణను కూడా మెరుగుపరచడంలో తోడ్పడుతాయి. రోజూ 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల శరీరంలోని కొవ్వుని తగ్గించుకోవచ్చు.
గ్రీన్ టీ కూడా చెడు కొలెస్ట్రాల్ ని అదుపుచేయడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే పాలీఫినాల్స్ మూలకాలతో అపారమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ తాగని వాళ్లతో పోల్చినపుడు దీనిని తాగే వాళ్లలో కొలెస్ట్రాల్ లెవల్స్ తక్కువగా ఉన్నట్టు పరిశధనల్లో తేలింది. రోజూ 2 నుండి 3 కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అధిక కొవ్వును కరిగించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
అలాగే ధనియాల్లో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, బీటా కెరోటిన్ ఇంకా విటమిన్ సి మొదలైనవి చెడు కొలెస్ట్రాల్ ను అదుపుచేయడంలో సహాయ పడతాయి. అంతే కాకుండా మెంతుల్లో ఉండే విటమిన్ ఇ కొవ్వుని తస్తుంది. దీని కోసం రోజూ 1 లేదా 2 టీ స్పూన్ల మెంతులను తీసుకోవాలి. ఇంకా ఉసిరి కూడా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ 1 లేదా 2 ఉసిరి కాయలని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గడం మాత్రమే కాకుండా మన శరీరానికి ఆక్సీకరణ వలన కలిగే నష్టాలను కూడా కంట్రోల్ చేయడంలో లాభదాయకంగా ఉంటుంది. ఇలా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.