సాధారణంగా యుక్త వయస్సులో ఉన్నవారి కన్నా 50 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో మెటబాలిజం మందగిస్తుంది. అంటే శరీరం క్యాలరీలను తక్కువగా ఖర్చు చేస్తుంది. ఈ విషయాన్ని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ వెల్లడించింది. అయితే క్యాలరీలను శరీరం తక్కువగా ఖర్చు చేస్తుంది కనుక నిత్యం తక్కువ క్యాలరీలను అందించే ఆహారాలనే తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. 50 ఏళ్లకు పైబడిన వారిలో ఎక్కువగా హైబీపీ, గుండె జబ్బులు, డయాబెటిస్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తుంటాయి. అయితే నిత్యం సరైన జీవనశైలిని పాటిస్తే ఈ వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అందుకు గాను ఆహారంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి. దీని వల్ల క్యాన్సర్లతోపాటు గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.
వయస్సు పెరిగే కొద్దీ ఎవరికైనా సరే కండరాలు బలహీనమవుతుంటాయి. అలాంటప్పుడు అవి దృఢంగా ఉండడం కోసం ప్రోటీన్లు ఉన్న ఆహారాలను నిత్యం తినాలి. ప్రోటీన్ల విషయానికి వస్తే కోడిగుడ్లు ఉత్తమంగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరానికి అందే ప్రోటీన్లు కండరాలను దృఢంగా మారుస్తాయి. అలాగే కోడిగుడ్లలో ఉండే విటమిన్ డి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా శరీరానికి పోషణను అందిస్తాయి. దీంతో శరీరం దృఢంగా ఉంటుంది. అలాగే కొవ్వు ఎక్కువగా చేరకుండా ఉంటుంది.
అవకాడోల్లో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. బీపీని తగ్గించేందుకు సహకరిస్తాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. అవకాడోలను తినడం వల్ల అధిక బరువు, వాపులను తగ్గించుకోవచ్చు.
స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, క్రాన్ బెర్రీల వంటి బెర్రీల్లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంద. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు బెర్రీల్లో ఎక్కువగా ఉంటాయి కనుక క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. స్కిన్, బ్లాడర్, లంగ్, బ్రెస్ట్ వంటి క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
బాదంపప్పు, వాల్ నట్స్‌లో శరీరానికి ఉపయోగపడే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వీటిని నిత్యం 6 నుంచి 10 మోతాదులో తీసుకోవాలి. 50 ఏళ్లకు పైబడిన వారు వీటిని నిత్యం తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
బీట్ రూట్‌లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి. శరీరానికి ప్రోటీన్లను అందిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. పొటాషియం ఎక్కువగా ఉంటుంది కనుక రక్త సరఫరా మెరుగు పడుతుంది. అలాగే శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి.