క్రాన్ బెర్రీలు ఉత్తర అమెరికాలో ఎక్కువగా పండుతాయి. అక్కడి అనేక ప్రాంతాల్లో క్రాన్ బెర్రీలను పండిస్తారు. అందువల్ల ఈ పండ్లు అక్కడి నేటివ్ ఫ్రూట్స్‌గా మారాయి. వీటిని సూపర్‌ఫుడ్‌గా వ్యవహరిస్తారు. ఇవి పుల్లగా ఉంటాయి. అందువల్ల వీటిని చాలా మంది జ్యూస్ లేదా ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటారు. వీటితో సాస్, పొడి, సప్లిమెంట్లు తయారు చేసి తీసుకుంటారు. ఇక డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ ఇవి మనకు లభిస్తాయి. అయితే క్రాన్ బెర్రీలలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అవి మన శరీరానికి ఎంతగానో అవసరం. వాటి వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ క్రమంలోనే క్రాన్ బెర్రీల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రాన్‌బెర్రీలలో అనేక విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పురాతన కాలంలో అమెరికా వాసులు ఈ పండ్లతో అనేక వ్యాధులను నయం చేసుకునేవారు. వీటి వల్ల కిడ్నీ సమస్యలను, జీర్ణాశయం సమస్యలను, స్కర్వీ వంటి వ్యాధులను వారు తగ్గించుకునేవారు.
* క్రాన్ బెర్రీలలో ఫైటో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రాశయ గోడలపై బాక్టీరియా పెరగకుండా చూస్తాయి. దీంతో మూత్రాశయ సంబంధ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
* క్రాన్ బెర్రీలలో పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి గుండె సంబంధ వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి. క్రాన్ బెర్రీ సప్లిమెంట్ల వల్ల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) తగ్గుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది.
* క్రాన్ బెర్రీలలో ఉండే పలు పోషకాలు క్యాన్సర్ కణాలపై పోరాటం చేస్తాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఆ పోషకాలు క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. వాపులను తగ్గించి అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి.
* క్రాన్ బెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన నోట్లోని బాక్టీరియాను నాశనం చేస్తాయి. చిగుళ్ల వ్యాధులను తగ్గిస్తాయి. దంత సమస్యలు రాకుండా చూస్తాయి. ఈ వివరాలను న్యూయార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెంటిస్ట్రీ పరిశోధకులు వెల్లడించారు.
క్రాన్ బెర్రీలలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. మిగిలిన భాగంలో పోషకాలు ఉంటాయి.
* క్యాలరీలు – 46
* నీరు – 87 శాతం
* ప్రోటీన్లు – 0.4 గ్రాములు
* కార్బొహైడ్రేట్లు – 12.2 గ్రా.
* షుగర్ – 4 గ్రా.
* ఫైబర్ – 4.6 గ్రా.
* ఫ్యాట్ – 0.1 గ్రా.
ఇవే కాకుండా ఇన్‌సాల్యుబుల్ ఫైబర్, విటమిన్లు సి, ఇవి, కె1, మాంగనీస్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు క్వర్సెటిన్, మైరిసెటిన్, పియోనిడిన్, ఉర్సోలిక్ యాసిడ్, ఎ-టైప్ ప్రొయాంథోసయనైడిన్స్ తదితర అనేక పోషకాలు క్రాన్ బెర్రీలలో ఉంటాయి. వీటిని ఇతర నట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్‌తో కలిపి తినవచ్చు. లేదా నేరుగా తీసుకోవచ్చు. స్మూతీలు, ఓట్ మీల్స్, సిరియల్ మీల్స్, సలాడ్స్ తదితర ఆహారాలతోపాటు తీసుకోవచ్చు. అయితే క్రాన్ బెర్రీలను మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పరిమితికి మించితే వీటి వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా, కిడ్నీ స్టోన్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక వీటిని మోతాదులో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.