Daily One Kiwi Fruit : మనం కివీ పండ్లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దాదాపు మనకు అన్ని కాలాల్లో ఈ పండ్లు విరివిగా లభిస్తాయి. కివీ పండ్లు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని సలాడ్ రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. డెంగ్యూ జ్వరం బారిన పడినప్పుడు మాత్రమే ఈ పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల ప్లేట్ లేట్స్ సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెప్పడంతో ఆ సమయంలో వీటిని ఆహారంగా తీసుకుంటారు. కానీ రోజూ కివీ పండును తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
రోజూ కివీ పండును తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు. రోజూ ఒక కివీ పండును తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కివీ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, కెరోటినాయిడ్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే రోజూ వారి విటమిన్ సి లభిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.
అలాగే ఆస్థమాతో బాధపడే వారు ఈ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఆస్థమా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అలాగే ఈ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. రోజూ ఒక కివీ పండును తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటికి సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. అలాగే నిద్రలేమితో బాధపడే వారు రోజూ ఒక కివీ పండును సాయంత్రం సమయంలో తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడూ అందంగా, యవ్వనంగా కనబడాలనుకునే వారు రోజూ ఒక కివీపండును తప్పకుండా తీసుకోవాలి.
కివీ పండులో ఉండే విటమిన్ ఇ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల చర్మంపై మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. అదే విధంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్ మన శరీరానికి చక్కగా అందాలంటే మనం తప్పకుండా కివి పండ్లను తీసుకోవాలి. అలాగే కివీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడి మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా కివీ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటి వల్ల కలిగే ప్రయోజనాలు మన శరీరానికి చక్కగా అందాలంటే వీటిని మనం ప్రతిరోజూ తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.