Sapota : మనకు చూడగానే తినాలనిపించే పండ్లలో సపోటా పండ్లు కూడా ఒకటి. ఇతర పండ్ల లాగా సపోటా పండ్లు కూడా అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. సపోటా పండ్లను తినడం వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సపోటా పండ్లను తినడం వల్ల నీరసం తగ్గి తక్షణశక్తి లభిస్తుంది. సపోటా పండ్లలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ తోపాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. సపోటా పండ్లను తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. సపోటా పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన శ్లేష్మం బయటకు పోయి దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
సపోటా పండ్లలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలను తగ్గించే శక్తి కూడా సపోటా పండ్లకు ఉంటుంది. గర్భిణీ స్త్రీలు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆందోళనను, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగించే గుణాన్ని కూడా సపోటా పండ్లు కలిగి ఉంటాయి.
అంతేకాకుండా సపోటా పండ్లు యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. చర్మ ఆరోగ్యాన్ని కూడా సపోటా పండ్లు మెరుగుపరుస్తాయి. సపోటా పండ్లలో ఉండే గింజలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ గింజల నుండి తీసిన నూనెను జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సపోటా గింజలను మెత్తగా నూరి విష కీటకాలు కుట్టిన చోట ఉంచి కట్టుకట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా సపోటా పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.