Litchi : లిచి.. మనం తినదగిన పండ్లల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో మనకు మార్కెట్ లో ఈ పండ్లు కూడా విరివిరిగా లభిస్తూ ఉన్నాయి. అలాగే ఈ పండ్ల జ్యూస్ కూడా సూపర్ మార్కెట్ లలో, ఆన్ లైన్ లో లభిస్తూ ఉంది. లిచి పండ్లు సపిండుసియే కుటుంబానికి చెందిన పండ్లు. వీటి లోపల గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. ఈ తెలుపు రంగులో ఉండే గుజ్జును మాత్రమే మనం ఆహారంగా తీసుకోవాలి. దీనిపై ఉండే పొట్టు తినడానికి పనికి రాదు. అలాగే ఈ పండ్ల లోపల నల్లగా మచ్చలుగా ఉండే ఒక గింజ మాత్రమే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ పండ్లతో జ్యూస్ లు, ఐస్ క్రీమ్ లు, జెల్లీలను కూడా తయారు చేస్తున్నారు. ఇతర పండ్ల వలె లిచి పండ్లు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కనుక వేసవి కాలంలో తప్పకుండా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. లిచి పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఈ పండ్లల్లో కాపర్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు కూడా ఉంటాయి. లిచి పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లిచి పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి మనల్ని ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, డయాబెటిస్ బారిన పడకుండా చేయడంలో కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్లు మనకు సహాయపడతాయి.
అంతేకాకుండా దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు లిచి పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లిచి పండ్లు యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, మలబద్దకం సమస్యను తగ్గించడంలో దోహదపడుతుంది. అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని శరీరాన్ని రోగాల బారిన పడకుండా చేయడంలో సహాయపడుతుంది. అదే విధంగా లిచి పండ్లను తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
చర్మం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ఎండ వల్ల కందిన చర్మాన్ని బాగు చేయడంలో అలాగే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా లిచి పండ్లు మనకు తోడ్పడతాయి. లిచి పండ్లను తినడం వల్ల ఇలాంటి అనేక ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చని కనుక వీటిని కూడా తప్పకుండా డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.