Nectarines : ఈ పండ్లు మనకు బయట మార్కెట్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ వీటిని చాలా మంది పట్టించుకోరు. వీటినే నెక్టారిన్స్ అంటారు. ఇవి ఈ సీజన్‌లో మనకు ఎక్కువగా లభిస్తాయి. ఇవి తీపి, పులుపు రుచిని కలిగి ఉంటాయి. అయితే సూపర్ మార్కెట్లలో మనకు ఇవి ఏడాది పొడవునా లభిస్తాయి. 2వేల ఏళ్ల కిందట చైనాలో మొదటగా ఈ పండ్లను పండించారు. తరువాత ఇవి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి. అయితే పీచ్ పండ్లకు, వీటికి చాలా పోలికలు ఉంటాయి. అందువల్ల వీటిని చూసి చాలా మంది పీచ్ పండ్లు అని భావిస్తారు. పీచ్ పండ్లకు, నెక్టారిన్లకు తొక్క భిన్నంగా ఉంటుంది. అందువల్ల వీటిని సులభంగా గుర్తించవచ్చు. ఇక నెక్టారిన్స్ ను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెక్టారిన్స్ పండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే మన శరీరానికి పోషణ లభిస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఈ పండ్లలో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గించుకునేందుకు సహాయ పడుతుంది. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు.
ఈ పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరచడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి రోగాలు రాకుండా చూస్తుంది. అలాగే నెక్టారిన్స్‌ను తింటే పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నెక్టారిన్ పండ్లను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఈ పండ్లు మీకు బయట ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా కొని తెచ్చుకోండి. వీటిని తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.