ఎండు ద్రాక్ష.. రైజిన్స్.. కిస్మిస్.. ఇలా వీటిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. భిన్న రకాలకు చెందిన ద్రాక్ష పండ్లను ఎండబెట్టి వీటిని తయారు చేస్తారు. ఇవి డ్రై ఫ్రూట్స్ జాబితాలోకి వస్తాయి. వీటిని చాలా మంది స్వీట్లలో వేస్తుంటారు. ఇవి చక్కని రుచిని కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే నిత్యం గుప్పెడు మోతాదులో కిస్మిస్‌లను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కిస్మిస్‌లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ (పీచు పదార్థం), ఐరన్, కాల్షియంతోపాటు మన శరీరానికి అవసరమైన ఇతర ముఖ్యమైన పోషకాలు వీటిల్లో ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. కాంతివంతంగా మారుస్తాయి.
కిస్మిస్‌లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తుంది. నిత్యం గుప్పెడు మోతాదులో వీటిని తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు.
కిస్మిస్‌లు తియ్యగా ఉంటాయి. అయినప్పటికీ వీటిల్లో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి. అందువల్ల వీటిని తక్కువగా తిన్నా ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుంటారు. దీంతో అధిక బరువు తగ్గవచ్చు.
కిస్మిస్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనేక విధాలుగా మనకు ఉపయోగపడతాయి. కిస్మిస్‌లలో ఉండే పాలిఫినోలిక్ ఫైటోన్యూట్రియెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో కంటి చూపు పెరుగుతుంది. కళ్లలో కండరాలపై పడే ఒత్తిడి తగ్గుతుంది. కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.
కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, ఎముకలు బలహీనంగా ఉన్నవారు నిత్యం కిస్మిస్‌లను తింటే ఫలితం ఉంటుంది. వీటిల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కనుక ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
కిస్మిస్‌లలో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. దీంతో మలబద్దకం సమస్య ఉండదు. విరేచనం సాఫీగా అవుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థాలను బయటకు పంపుతాయి. శరీర పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. దీని వల్ల రక్తంలో ఉండే విష పదార్థాలు తగ్గుతాయి. హానికరమైన గ్యాస్‌లు బయటకు పోతాయి. అసిడిటీ తగ్గుతుంది.
కిస్మిస్‌లలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. కిస్మిస్‌లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు జ్వరం, ఇన్‌ఫెక్షన్లు, ఇతర అనారోగ్య సమస్యలను రాకుండా చూస్తాయి.