Almonds : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పు ఒకటి. బాదం పప్పు చక్కటి రుచితో పాటు అనేక రకాల పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే వైద్యులు కూడా బాదం పప్పును ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. మనలో చాలా మంది ఈ బాదం పప్పును రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు కూడా. అయితే ఈ బాదం పప్పును నేరుగా తీసుకోవడం కంటే నానబెట్టి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ రాత్రి ఒక అర కప్పు నీటిలో 5 లేదా 6 బాదం పప్పులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ బాదం పప్పుపై ఉండే పొట్టును తీసేసి ఆహారంగా తీసుకోవాలి.
బాదం పప్పు పై ఉండే ఉండే పొట్టులో ట్యానిక్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. కనుక బాదం పప్పుపై ఉండే పొట్టును తీసేసి తినాలి. ఈ విధంగా నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అధిక బరువును తగ్గించడం దగ్గరి నుండి బీపీని నియంత్రించడం వరకు అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడం దగ్గర నుండి క్యాన్సర్ బారిన పడకుండా చేసే వరకు ఈ బాదం పప్పు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజువారి ఆహారంలో భాగంగా నానబెట్టిన బాదం పప్పును తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. బాదం పప్పులో ప్రోటీన్స్, విటమిన్ ఇ లతో పాటు ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇందులో ఉన్న ప్రోటీన్ కారణంగా మనకు ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం బరువు తగ్గవచ్చు. బాదం పప్పును తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బీపీ కూడా అదుపులో ఉంటుంది. నానబెట్టిన బాదం పప్పులో లిపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో బాదం పప్పు మనకు దోహదపడుతుంది. దీని వల్ల మన గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బాదం పప్పులో ఉండే విటమిన్ ఇ ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి ఫ్రీ రాడికల్స్ వల్ల మన శరీరానికి అలాగే మన చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో చర్మ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి.
దీనిలో ఉండే విటమిన్ 17, ప్లెవనాయిడ్స్ క్యాన్సర్ ముప్పును తగ్గించడంతో పాటు ట్యూమర్స్ ను కూడా పెరగకుండా చేస్తుంది. గర్భిణీ స్త్రీలు రోజూ నానబెట్టిన బాదం పప్పును తీసుకోవడం వల్ల తగినంత ఫోలిక్ యాసిడ్ లభించి గర్భస్థ శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. గర్భిణీల్లో వచ్చే రక్తహీనత కూడా తగ్గుతుంది. ఈ విధంగా బాదం పప్పును నానబెట్టి తీసుకోవడం వల్ల మనం ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.