Platelets Increasing Foods : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. మనకు ఆహ్లాదకరమైన వాతావరణనాన్ని అందించడంతోపాటు.. అనేక రోగాలను కూడా మోసుకుని వస్తుంది. ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరం వంటివి సాధారణంగా చాలా మందికి వస్తుంటాయి. అయితే కొన్ని రకాల వ్యాధులు దోమలు కుట్టడం వల్ల కూడా వస్తాయి. వాటిల్లో డెంగ్యూ ఒకటి. దీనికి కచ్చితమైన చికిత్స అంటూ లేదు. అందుబాటులో ఉండే యాంటీ బయోటిక్ మందులను అందిస్తూ చికిత్స చేస్తారు. అయితే డెంగ్యూ వచ్చిన వారికి 3వ రోజు నుంచి ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. ఈ దశలో తప్పక చికిత్సను అందించాలి.
ప్లేట్‌లెట్స్ పడిపోతున్నప్పుడు చికిత్సను అందించకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. ప్లేట్‌లెట్స్ సంఖ్య 20వేలకు వస్తే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక సాధారణ జ్వరం వచ్చినా సరే డెంగ్యూ ఉందేమోనని అనుమానించాలి. వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఒక వేళ డెంగ్యూ అని తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి.
ఇక డెంగ్యూ వచ్చిన వారు ప్లేట్‌లెట్ల సంఖ్యను సహజసిద్ధంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే త్వరగా కోలుకుంటారు. డెంగ్యూ వచ్చిన తరువాత 3వ రోజు నుంచి చికిత్స తీసుకున్నా.. 6వ రోజు నుంచి ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. అయితే డాక్టర్లు ఇచ్చే మందులతోపాటు పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల త్వరగా ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. దీంతో త్వరగా కోలుకుంటారు. ఇక ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరంలో ఐరన్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే ప్లేట్‌లెట్స్ ను పెంచుకోవచ్చు. రోజుకు 2 నుంచి 4 ఖర్జూరాలను తినాలి. రాత్రి పూట వీటిని నానబెట్టి ఉదయం పరగడుపున తింటే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే బొప్పాయి పండ్లను బాగా తినాలి. బొప్పాయి ఆకుల రసాన్ని పావు టీస్పూన్ చొప్పున రోజుకు 2 సార్లు తీసుకోవాలి. దీంతో ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి.
యాప్రికాట్ పండ్లను తిన్నా కూడా ప్లేట్‌లెట్లను పెంచుకోవచ్చు. ఇవి ఐరన్, విటమిన్ సి ని కలిగి ఉంటాయి. కనుక వీటిని తింటే డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే రోజుకు ఒకటి లేదా రెండు క్యారెట్లను తినాలి. ఇవి కూడా ప్లేట్‌లెట్స్ పెరిగేందుకు సహాయం చేస్తాయి. దీంతోపాటు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ను తాగాలి. ఇది రక్తం బాగా తయారయ్యేందుకు.. ప్లేట్‌లెట్స్ ఏర్పడేందుకు సహాయ పడుతుంది. అలాగే ఆకుకూరలు, కిస్మిస్, దానిమ్మ పండ్లు, వెల్లుల్లి తదితర ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. దీంతోపాటు డెంగ్యూ నుంచి త్వరగా కోలుకుంటారు.