Sajjalu : ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలు మానవాళికి ఎన్నో విధాలుగా మేలు చేస్తూ ఉంటాయి. వాటి వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అందరూ అంగీకరించి తీరాల్సిందే. అలాంటి ఆహారాల్లో సజ్జలు కూడా ఒకటి. వీటిని ఆంగ్లంలో పర్ల్ మిల్లెట్స్ అని అంటారు. చూడడానికి చిన్నగా ఉండే ఈ సజ్జల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం సమస్యను తగ్గించడంలో ఈ సజ్జలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో సజ్జలు ఏవిధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సజ్జలు ఎంతో సహాయపడతాయి. సజ్జ పిండితో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. సజ్జల్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడే వారు రోజూ మొలకెత్తిన సజ్జలను అర కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. సజ్జలను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వుతోపాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా తొలగిపోతుంది. దీంతో మనం చాలా సులువుగా, ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.
సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో పుష్కలంగా ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించడంలో దోహదపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా షుగర్ వ్యాధి ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలను నయం చేయడంలో సజ్జలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోవడంతోపాటు పలు రకాల క్యాన్సర్ ల బారిన కూడా పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.
మాంసాహారం తినని వారు సజ్జలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను తొలగించడంలో కూడా సజ్జలు మనకు సహాయపడతాయి. పిల్లలకు తరచూ సజ్జలతో చేసిన ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఈ విధంగా సజ్జలు మనకు బరువు తగ్గడంతోపాటు అనేక విధాలుగా మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.