Black Chickpeas : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో శనగలు కూడా ఒకటి. ఇవి మనందరికీ తెలుసు. దాదాపుగా ప్రతి ఒక్కరి వంటింట్లో శనగలు ఉంటాయి. వీటిని గుగ్గిళ్లుగా, కూరగా చేసుకుని తింటూ ఉంటాం. శనగలను అప్పుడప్పుడూ తినడానికి బదులుగా వీటిని ప్రతి రోజూ కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ శనగలను ఎప్పుడు, ఎలా తీసుకోవాలి అన్న విషయాల గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. శనగలను ఎలా తీసుకోవడం వల్ల మనం అధిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగలను తినడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ప్రతి రోజూ ఒక గుప్పెడు శనగలను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఒక గుప్పెడు శనగలను ఒక గిన్నెలోకి తీసుకుని అవి మునిగిపోయే వరకు నీటిని పోసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన శనగలను నేరుగా లేదా కొద్దిగా ఉడికించి ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి. నానబెట్టిన శనగల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడంలో సహాయపడతాయి. ఇలా శనగలను తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అంతేకాకుండా ఇలా నానబెట్టిన శనగలను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరుగుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట ఈ శనగలను తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. తద్వారా మనం తీసుకునే ఆహారం మోతాదు తగ్గి మనం త్వరగా బరువు తగ్గవచ్చు. శాకాహారులకు శనగలు ఒక వరమని చెప్పవచ్చు. మాంసంలో కంటే శనగల్లో అధిక ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి.
అంతేకాకుండా శనగల్లో వివిధ రకాల విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. నానబెట్టిన శనగలను తినడం వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత సమస్య ఉన్న వారు శనగలను తినడం వల్ల రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరిగి త్వరగా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. పిల్లలకు ఈ శనగలను ఆహారంలో భాగంగా ఇవ్వడం వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఇలా ప్రతిరోజూ శనగలను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. అదే విధంగా నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది.
ఉదయం పూట ఇలా శనగలను తినడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కాలేయ సంబంధిత సమస్యలు, మూత్ర పిండాల సంబంధిత సమస్యలతో బాధపడే వారు శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. ఇలా నానబెట్టిన లేదా ఉడికించిన శనగలను తినడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.
కేవలం శనగలనే కాకుండా శనగలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల కూడా మనకు మేలు కలుగుతుంది. ఈ విధంగా శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మన అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా వాటి బారిన కూడా పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.