Beerakayalu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. దీని పేరు చెప్పగానే చాలా మంది ముఖం పక్కకు తిప్పుకుంటారు. ఇతర కూరగాయల లాగా బీరకాయలు కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బీరకాయలు పోషకాలనే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ బీరకాయలు ఎంతో సహాయపడతాయి. బీరకాయలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
బీరకాయల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణ శక్తిని మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా బీరకాయలు త్వరగా జీర్ణమవుతాయి. కనుక వీటిని జబ్బు చేసిన వారికి, జబ్బు నుండి కోలుకున్న వారికి ఆహారంగా ఇవ్వవచ్చు. బరువు తగ్గడంలో కూడా బీరకాయలు మనకు దోహదపడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాన్ని కూడా బీరకాయలు కలిగి ఉంటాయి. బీరకాయలను తినడం వల్ల మనం తరచూ రోగాల బారిన, ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. బీరకాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
చర్మంపై ఉండే మృతకణాలను తొలగించే శక్తి కూడా బీరకాయల్లో ఉంటుంది. అంతేకాకుండా ముఖంపై వచ్చే మొటిమలను, మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో కూడా బీరకాయలు ఉపయోగపడతాయి. కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలు కూడా బీరకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల తగ్గుతాయి. బీరకాయల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.
బీరకాయలను తినడం వల్ల శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గుతాయి. కంటి చూపును మెరుగుపరచడంతోపాటు శరీరంలోని మలినాలను తొలగించడంలో కూడా బీరకాయలు మనకు సహాయపడతాయి. కనుక బీరకాయలను తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని.. వీటిని తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.