ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్యాప్సికంను తింటుంటారు. రకరకాల రంగుల్లో క్యాప్సికం అందుబాటులో ఉంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో క్యాప్సికం లభిస్తుంది. దీంతో చాలా మంది రకరకాల వంటలు చేస్తుంటారు. అయితే క్యాప్సికంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటంటే..
1. క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఎరుపు రంగు క్యాప్సికంలో లైకోపీన్ అనబడే ఫైటో న్యూట్రియెంట్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాప్సికంలో ఉండే ఫోలేట్, విటమిన్ బి6 లు హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
2. అధిక బరువు తగ్గాలనుకునే వారు క్యాప్సికంను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. క్యాప్సికంను తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అలాగే జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
3. క్యాప్సికంను తరచూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. క్యాప్సికంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి. క్యాప్సికంలో కెరోటినాయిడ్ లైకోపీన్ ఉంటుంది. ఇది గర్బాశయ, ప్రోస్టేట్, పాంక్రియాస్, మూత్రాశయ క్యాన్సర్లు రాకుండా చూస్తుంది. క్యాప్సికంలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణవ్యవస్థలోని అవయవాలకు క్యాన్సర్ రాకుండా చూస్తాయి.
4. క్యాప్సికంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల రక్త నాళాలు, కణాలు దెబ్బ తింటాయి. అందువల్ల వాటిని తొలగించాలి. అందుకు గాను క్యాప్సికం ఉపయోగపడుతుంది. దీని వల్ల కళ్లలో శుక్లాలు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
5. క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వాపులను తగ్గిస్తుంది. క్యాప్సికంలో ఉండే విటమిన్ కె గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టేందుకు సహాయపడుతుంది. దీంతో రక్త స్రావం అధికంగా అవకుండా నిరోధించవచ్చు.
6. క్యాప్సికంలో క్యాప్సెయిసిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది.
7. క్యాప్సికంను తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. క్యాప్సికంలో ఉండే విటమిన్ సి మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం గ్రహించేలా చేస్తుంది. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365