Sweet Potato : చిలగడ దుంపలు.. వీటిని మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఈ దుంపలు తియ్యని రుచిని కలిగి ఉంటాయి. వీటిని మోరం గడ్డ, కందగడ్డ అని కూడా పిలుస్తారు. ఈ చిలగడ దుంపలలో ఉండేన్ని పోషకాలు మరే ఇతర దుంపల్లో ఉండవని నిపుణులు చెబుతున్నారు. వీటిని మనం ఉడికించి, కాల్చి లేదా కూరగా వండుకుని తింటూ ఉంటాం. ఈ చిలగడ దుంపలు మనకు సంవత్సరమంతా దొరకపోయినప్పటికీ దొరికినప్పుడు మాత్రం వీటిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
చిలగడ దుంపల్లో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. చిలగడ దుంపలలో కార్డినాయిల్స్, పాలిఫినాల్స్ వంటి ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. ఈ దుంపలోని పోషకాలు లభించడం అనేది మనం తీసుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. చిలగడ దుంపలను ఆవిరి మీద ఉడికించి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చిలగడ దుంపల్లో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయి. చిలగడ దుంపలను తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే నొప్పులు, వాపులతోపాటు కండరాల తిమ్మిర్లు కూడా తగ్గుతాయి.
మూత్ర పిండ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ దుంపలను తీసుకోవడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. జీర్ణాశయంలో వచ్చే అల్సర్లతోపాటు గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా చిలగడ దుంప మనకు ఉపయోగపడుతుంది. చిలగడ దుంపలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. ఈ దుంప తియ్యగా ఉంటుంది. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు దీనిని ఎక్కువగా తినకూడదని అనుకుంటారు.
కానీ దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా చిలగడ దుంపలు మనకు సహాయపడతాయి. ఈ విధంగా చిలగడ దుంప మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ దుంప దొరికే సమయంలోనైనా దీనిని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.