Mosquitoes : వర్షాకాలంలో జ్వరాల కారణంగా ఆసుపత్రుల పాలయ్యే వారు చాలా మందే ఉంటారు. ఈ జ్వరాల కారణంగా ఆసుపత్రులు కిక్కిరిసి పోవడం మనం చూస్తూనే ఉంటాం. జ్వరాలు రావడానికి వాతావరణ మార్పు ఒక కారణమైతే మరో ప్రధాన కారణం దోమలు అని చెప్పవచ్చు. దోమలు అన్ని కాలాల్లో ఉన్నప్పటికీ వర్షాకాలంలో వీటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జ్వరాల బారిన పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి దోమకాటు ప్రాణాంతకం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు దోమకాటు బారిన పడకుండా చూసుకోవడమే ఉత్తమమైన మార్గం.
దోమలను నివారించడానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎక్కువగా మనం దోమలను నివారించే రిఫిల్స్ ను, కాయిల్స్ ను ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో రసాయనాలు అధికంగా ఉంటాయి. కనుక వీటిని వీలైనంత వరకు వాడకపోవడమే మంచిది. సహజసిద్ధ పదార్థాలను ఉపయోగించి కూడా దోమలను ఇంట్లో నుండి పరారయ్యేలా చేయవచ్చు. దోమలను నివారించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం ముందుగా పొట్టు తీసిన 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలతోపాటు ఒక కర్పూరాన్ని కూడా రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమానికి అర టీ స్పూన్ వామును కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒక మట్టి ప్రమిదలోకి కానీ చిన్న మట్టి గిన్నెలోకి కానీ తీసుకోవాలి. తరువాత ఈ మిశ్రమంపై మరో మూడు కర్పూరం బిళ్లలను ఉంచాలి. ఇప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి కర్పూరాన్ని వెలిగించాలి. దీని నుండి వచ్చే పొగను ఇళ్లంతా వ్యాపించేలా చేయాలి.
ఇలా చేయడం వల్ల కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఇంట్లో ఉండే దోమలు అన్నీ నశిస్తాయి. వెల్లుల్లి, వాము నుండి వచ్చే ఘాటు వాసన కారణంగా దోమలు నశిస్తాయి. ఈ చిట్కాను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండానే ఇంట్లో ఉండే దోమలన్నీ నివారించబడతాయి. ఈ చిట్కాను పాటించడంతోపాటు ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల దోమ కాటు బారిన పడకుండా ఉంటాం.