Off Beat

హెలికాప్టర్ గాల్లో ఎలా ఎగురుతుందో తెలుసా..?

చాలా మంది విమానం లో ప్రయాణించాలని అనుకుంటారు, కానీ కొంత మంది మాత్రం హెలికాప్టర్ లో ప్రయాణించాలనుకుంటారు, విమానం గురించి మనకు చాలా విషయాలే తెలుసు, కానీ హెలికాప్టర్ లోని పరికరాల గురించి కానీ, లేక ఇతర విషయాల గురించి కానీ చాలా తక్కువ మందికి తెలుసు. విమానం చేయలేని పనులను కూడా హెలికాప్టర్‌ చేయగలదు.

రన్‌వే పై పరుగెత్తకుండానే ఉన్న చోట నుంచి నిట్టనిలువుగా పైకి లేవగలదు. కావాలంటే వెనక్కు ఎగరగలదు. ఎగురుతూ కావలసిన చోట ఆగిపోయి ఉండగలదు. గాలిలో పూర్తిగా గుండ్రంగా తిరుగగలదు. ఇన్ని ప్రత్యేకతలతో హెలికాప్టర్‌ ఎగరడానికి దానిలోని ప్రధాన భాగాలైన మెయిన్‌ రోటర్‌, డ్రైవ్‌ షాప్ట్‌, కాక్‌పిట్‌, టెయిల్‌ రోటర్‌, లాండింగ్‌ స్కిడ్స్‌ దోహదం చేస్తాయి. మన ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌ను తీసుకొచ్చి తిరగేసి బిగించినట్టుగా హెలికాఫ్టర్‌ మీద పెద్ద పెద్ద రెక్కలున్న పంకా ఉంటుంది. ఈ మొత్తం అమరికను ‘మెయిన్‌ రోటర్‌’ అంటారు.

ఈ రెక్కలు గిరగిరా తిరగడం వల్లనే హెలికాప్టర్‌ పైకి లేస్తుంది. అంత బరువైన హెలికాఫ్టర్‌ను పైకి లేపేటంత ‘లిఫ్ట్‌’ (బలం) ఏర్పడేలా రెక్కలను వేగంగా తిప్పడానికి ప్రత్యేకమైన ఇంజను ఉంటుంది. పంకా రెక్కలు హెలికాఫ్టర్‌ చుట్టూ ఉండే గాలిని కిందకు నెడతాయి. ఇది చర్య అనుకుంటే, దీనికి ప్రతిచర్యగా హెలికాప్టర్‌ పైకి లేస్తుంది. పంకా తిరగడంతో పైకి లేచిన హెలికాప్టర్‌ దానికి వ్యతిరేక దిశలో గిరగిరా తిరగాలి కదా. మరి దాన్ని ఆపాలంటే, మెయిన్‌ రోటర్‌ తిరిగే దిశకు వ్యతిరేకంగా పనిచేసే సమానమైన బలం కావాలి. ఈ బలాన్ని హెలికాప్టర్‌ తోకకు ఉండే రెక్కలు (టెయిల్‌ రోటర్‌) కలిగిస్తాయి.

do you know how helicopter flies in air

ఈ రెక్కలు తిరగడం వల్లనే హెలికాప్టర్‌ పైకి లేచిన తర్వాత స్థిరంగా ఉండ గలుగుతుంది. హెలికాప్టర్‌ తలమీద, తోక దగ్గర ఉండే రెక్కల్ని ఒకే ఇంజను ద్వారా తిప్పే ఏర్పాటు ఉంటుంది. ఇక ‘కాక్‌ పిట్‌’లో పైలట్‌ దగ్గర రెండు రకాల కంట్రోల్సు ఉంటాయి. ఒకటి ‘సైకిక్‌ కంట్రోల్‌’ అయితే, మరొకటి ‘కలెక్టివ్‌ కంట్రోల్‌’. సైకిక్‌ కంట్రోల్‌ ద్వారా పైలెట్‌ హెలికాప్టర్‌ను ముందుకు, వెనక్కు, కుడి ఎడమలకు తిప్పకలుగుతాడు. కలెక్టివ్‌ కంట్రోల్‌ ద్వారా పైకి, కిందికి తిప్పకలుగుతాడు. పైలట్‌ కాళ్ల దగ్గర టెయిల్‌ రోటర్‌ వేగాన్ని నియంత్రించే పెడల్స్‌ ఉంటాయి. ఇన్ని సదుపాయాలున్న హెలికాప్టర్‌ని 75 సంవత్సరాల క్రితం ఐగర్‌ సికోరస్కీ అనే ఇంజనీరు రూపొందించాడు.

హెలికాప్టర్ ను ఎక్కువ శాతం పారిశ్రామిక వేత్తలు, రాజకీయనాయకులు వాడతారు, ముఖ్యంగా మన దేశం లో ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళడానికి బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయనాయకులు హెలికాప్టర్ లను వాడతారు. భ‌వనాల పైన కూడా హెలికాప్టర్ ను ల్యాండ్ చెయ్యొచ్చు. విపత్తు సమయాల్లో మిలిటరీ వాళ్ళు సహాయక చర్యలకు హెలికాప్టర్ లను వాడతారు, హెలికాప్టర్ నడిపే వ్యక్తి చాలా ప్రతిభావంతుడు అయ్యుండాలి.

Admin

Recent Posts