Off Beat

మానవ సంబంధాలే విలువైన ఆస్తి….!

ప్రదీప్ వాళ్ళ మావ‌ గారి ఊరు వెళ్ళాడు . అక్కడ ఆయన బ్యాంకు కి వెడుతూ నువ్వూ వస్తావా అని అల్లుడిని అడిగారు . పొద్దుటే అత్తగారు చేసిపెట్టిన అల్లం పెసరట్టు కడుపులో బరువు గా ఉండడం తో అది అరుగుతుంది కదా అని బయలుదేరాడు మామ గారితో. ఇద్దరూ కాలి నడకన దగ్గరలోనే ఉన్న బ్యాంకు కి వెళ్ళారు . అక్కడ ఆయన ఫారం తీసుకుని నింపి విత్ డ్రా చేసి , మళ్ళీ ఫారం నింపి ఎవరికో డబ్బు పంపుతున్నారు . అది అంతా అవ్వడానికి సుమారు ఒక గంట పట్టింది . ఈ లోగా పాపం ప్రదీప్ కి కడుపులో గుడ గుడ ప్రారంభం అయ్యింది . కొంచెం అసహనంగా ఉన్నాడు . పక్కన కూర్చున్న మామ గారితో..

మీరు ఇలా ఇక్కడ ఇంత సేపు కష్ట పాడడం ఎందుకండీ ? ఆన్ లైన్ బ్యాంకింగ్ సదుపాయం ఉండి కదా ? అన్నాడు .ఎందుకు అది ? ఏమిటి ప్రయోజనం ? అడిగారు ప్రదీప్ మామగారు .తన కడుపులో గుడ గుడలు మర్చిపోయాడు ప్రదీప్ . చెప్పడం మొదలు పెట్టాడు . మీరు ఆన్ లైన్ బ్యాంకింగ్ మొదలు పెట్టారనుకోండి ఇంటిదగ్గర నుండే మీరు అన్ని బిల్లులూ కట్టేయ్యోచ్చు . ఫండ్ ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు . అంతెందుకు ? మీకు కావలసిన వస్తువులు అన్నీ అమెజాన్ ద్వారా ఇల్లు కదలకుండా తెప్పించుకోవచ్చు . అన్నాడు.

human relations interesting story

అపుడు వాళ్ళ మామగారు ఇవాళ ఇక్కడకి వచ్చాక నేను నా పాత మిత్రులను నలుగురిని కలిశాను . చూశావు కదా బాబూ ! బ్యాంకు స్టాఫ్ తో కూడా నాలుగు మాటలు మాట్లాడాను . ఇక్కడకి రావడానికి ఇంటి దగ్గర ఒక అరగంట ముందు తయారయ్యాను . దారిలో తెలిసిన వారికి హాయ్ చెప్పాను . ఇంకో సంగతి , మొన్న మీ అత్త గారు కిరాణా షాప్ కి వెడుతూ దారిలో పడిపోయింది . అపుడు ఆ కిరాణా షాప్ వాడు ఆటో కట్టించి మీ అత్తగారిని ముందు డాక్టర్ దగ్గరకీ తర్వాత ఇంటికీ తీసుకు వచ్చాడు . మా పిలలు ఇద్దరూ మాకు వాట్సప్ ఫోటోలు పంపుతూ దూరంగానే ఉన్నారు. బాబూ ! మాకు మానవ సంబంధాలు ఉండాలి . టెక్నాలజీ తప్పు కాదు .ఇంట్లోనే ఉండి అన్ని పనులూ చేసేసుకుంటే ఈ వృద్ధాప్యం లో మాకు మానవులతో టచ్ ఎలా ఉంటుంది బాబూ ? మేము ఎదురు చూసేది వాటి కోసమే కదా !

కిందటి ఏడాది నేను జబ్బు పడితే నేను ఎప్పుడూ పండ్లు కొనే షాప్ అత‌ను ఇంటికి వచ్చి నన్ను చూసి ఏడ్చాడు. నేను పేపర్ కొనే అత‌ను రోజూ పాలు తెచ్చి పెట్టేవాడు . కావలసిన సామాను రిక్షా అబ్బాయి తెచ్చి పెట్టేవాడు . ఈ సంబంధాలన్నీ అమెజాన్ తెచ్చి పెట్టగలడా ? నేను నా కంప్యూటర్ తో మాత్రమే సంబంధం పెట్టుకుంటే ఇవి నాకు దక్కుతాయా ? అన్నాడు. మానవ సంబంధాలకంటే విలువైన ఆస్తి ఈ ప్రపంచంలో మరేది లేదు.

Admin

Recent Posts