ఆ దంపతుల కాపురం హాయిగా సాగుతోంది. టీనేజ్‌లో ఉన్న కూతురు బాగోగులు చూసుకుంటూ వారు హాయిగా కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో బిడ్డ మరీ అందంగా ఉండటం తండ్రిలో సందేహానికి తెరలేపింది. ఆమె తన కూతురు కాదేమోనన్న అనుమానంతో విషయం డీఎన్‌ఏ టెస్టు దాకా వెళ్లింది. తీరా డీఎన్‌ఏ టెస్టు చేయించి రిపోర్టులు చూసిన తండ్రికి మైండ్ బ్లాక్ అయ్యింది. ఆఖరికి సినిమా స్టైల్ ట్విస్టుతో సమస్య సమసిపోయింది. ఈ ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వియత్నాంలోని హనోయ్ నగర వాసులైన యువ దంపతులు తమ మూడేళ్ల కుమార్తెతో కలిసి కొన్నేళ్ల క్రితం హో చిన్ మిన్హ్ సిటీకి వెళ్లి స్థిరపడ్డారు. కుమార్తె లాన్ (Lan) ను అక్కడే స్కూళ్లో వేశారు. లాన్ టీనేజ్‌కు వచ్చేసరికి అందాల రాశి అయ్యింది. అదే ఆ తండ్రిలో అనుమాన బీజం వేసింది. దంపతులిద్దరం అందంగా లేకపోయినా తమ కుమార్తె ఎందుకు అందంగా పుట్టిందనే సందేహం కలిగింది. భార్య హాంగ్ (Hong) పై అనుమానంతో కుమార్తె లాన్‌కు డీఎన్‌ఏ టెస్టు చేయించాలని నిర్ణయించాడు.
అనుకున్నదే తడవు లాన్ డీఎన్ టెస్టు చేయించేశాడు. తీరా డీఎన్‌ఏ టెస్టు రిపోర్టు చూసిన తండ్రికి మైండ్ బ్లాక్ అయ్యింది. లాన్ తనకు పుట్టిన కుమార్తె కాదని తేలిపోయింది. దాంతో అతడు భార్య హాంగ్‌ను, కుమార్తె లాన్‌ను వదిలేశాడు. తర్వాత తాగుడుకు బానిస అయ్యాడు. దాంతో హాంగ్‌ను కుమార్తెను తీసుకుని తిరిగి హనోయ్ సిటీకి వెళ్లిపోయింది. అక్కడే కుమార్తెను స్కూళ్లో వేసింది. ఆ స్కూల్లో ల్యాన్ పుట్టిన రోజు, ఆమె క్లాస్‌లోని మరో అమ్మాయి పుట్టిన రోజు ఒకే రోజు ఉండేది. ఈ క్రమంలో ల్యాన్ తల్లి హాంగ్, మరో అమ్మాయి పేరెంట్స్ ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. పరిచయం పెరగడంతో ఓసారి ఇద్దరికి కలిపి ఉమ్మడిగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాన్ పుట్టిన ఆస్పత్రిలోనే ఆ అమ్మాయి కూడా పుట్టిందనే విషయాన్ని లాన్ తల్లి హాంగ్ తెలుసుకుంది. దాంతో ఇతరుల దగ్గర పెరుగుతున్న అమ్మాయే తన కుమార్తెనేమో అనే సందేహం కలిగింది.
దాంతో విషయాన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులతో పంచుకుంది. ఈ విషయంలో స్పష్టత కోసం మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయి డీఎన్‌ఏ టెస్టు చేయిద్దాం అనే ప్రతిపాదన తీసుకొచ్చింది. అందుకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించడంతో పాపకు డీఎన్‌ఏ టెస్టు చేయించారు. ఆ టెస్టులో ఆమె హాంగ్ కుమార్తె అని తేలింది. ఇన్నాళ్లు తన దగ్గర పెరిగిన లాన్ అవతలి దంపతుల కుమార్తె అనే విషయం స్పష్టమైంది.
అయితే ఈ విషయం బయటపడిన తర్వాత ఎవరి కుమార్తెను వాళ్లను తీసుకున్నారా..? లేదంటే ఎవరి దగ్గర పెరిగిన అమ్మాయిలను వాళ్లే చూసుకుంటున్నారా..? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. హాంగ్ భర్త తన పొరపాటు తెలుసుకుని తిరిగి భార్యతో కలిసిపోయాడా.. లేదా అనే విషయంలో కూడా క్లారిటీ కొరవడింది. అయితే ఈ కథనంపై నెటిజన్‌లు మాత్రం రకరకాలు స్పందించారు. ఎవరికి తోసిన విధంగా వాళ్లు కామెంట్లు చేశారు.