మనం అందరం కేజీఎఫ్ సినిమా చూసాము కదా, అందులో హీరో అంతులేని గని నుండి బంగారం తవ్వి తీస్తాడు. నిజానికి ప్రపంచంలో చాలా గనులు వెండి, బంగారం, ఉక్కు, ఇతర లోహాలు తవ్వేక్రమంలో ఒక ప్లాన్ వేసుకుని మాత్రమే తీస్తారు. ఎందుకంటే నాడా దొరికింది అని గుర్రం కొన్నట్లు ఉంటుంది సామెత. దానర్ధం మీ పెరట్లో ఒక బంగారు గని పడింది అనుకుందాం, అది తవ్వి తీయాలి అంటే రోజుకు 100 బుల్డోజర్లు, యాభై క్రేన్స్, 500 మంది ఉద్యోగులు కావాలి అనుకుందాం.
ఇంత పని జరగాలి అంటే మీరు పెట్టాల్సిన ఆదాయం ఒక బడ్జెట్ వేయాలి, తరువాత అక్కడ ఉన్న గని ఎంతవరకు తవ్వితే ఎంత బంగారం వస్తుంది అని అంచనా వేయాలి. మీరు పెట్టె ఖర్చు, మీకు వచ్చే ఫైనల్ బంగారం విలువ కన్నా తక్కువ ఉండాలి. అలా లేకపోతే ఆ గని తవ్వడం వృధా. అందుకే ప్రపంచంలో చాలా గనులు ఒక పరిమితి వరకే మైనింగ్ చేస్తారు, అంతకన్నా లోతుకు వెళితే పెట్టే పెట్టుబడి వచ్చే ఆదాయానికి సరితూగదు, కనుక వదిలేస్తారు.
ఇపుడు మీరు అడిగిన ప్రశ్న కూడా అలాంటిదే. రాకెట్ పంపించి తెచ్చే వజ్రాల ఖర్చు ఎక్కువ, వజ్రం ధర తక్కువ అయితే ఏమిటి ఉపయోగం. శని గ్రహం చుట్టూ ఉండే వాతావరణంలో వజ్రాలు వర్షాలలా పడతాయి అంటారు. అలా అని వెళ్ళి తెచ్చుకుంటామా ఏమిటి. అంబలి కన్నా ఆవకాయ ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకని అలా ఏది దొరికితే అది తెచ్చేయరు. అదే వ్యాపారం అంటే. జమా ఖర్చులు తెలియకుండా దిగితే జేబుకి రంధ్రం పడుతుంది.