Curry Leaves : జుట్టు నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, రసాయనాలు కలిగిన షాంపూలు వాడడం, మారిన ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పెరగకపోవడం వంటి అనేక రకాల సమస్యలు తలెత్తున్నాయి. ఈ సమస్యలతో బాధపడే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే ఈ జుట్టు సంబంధిత సమస్యల నుండి బయటపడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.
ఈ సమస్యలన్నింటిని బయటపడేయడంలో కరివేపాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ కరివేపాకును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చాలా వరకు మనం జుట్టు సంబంధిత సమస్యల నుండి బయట పడవచ్చు. కరివేపాకును కింద తెలిపిన విధంగా ఉపయోగించడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడం సమస్య ఉన్న వారు తాజా కరివేపాకును సేకరించి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ కు పెరుగును కలిపి జుట్టుకు రాసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత తలస్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల జుట్టుకు తగినంత తేమ అందడంతో పాటు జుట్టు కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి. కరివేపాకుతో ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు కరివేపాకుతో కషాయాన్ని చేసుకుని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలు తొలగిపోయి రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో జుట్టు కుదుళ్లకు పోషకాలు అంది జుట్టు రాలడం తగ్గుతుంది.
ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గిన్నెలో నీళ్లను పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో తాజా కరివేపాకును వేసి మరిగించాలి. ఇలా చేయడం వల్ల కరివేపాకు కషాయం తయారవుతుంది. దీనిని వడకట్టుకుని తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. అదే విధంగా కరివేపాకును ఉపయోగించి జుట్టు సమస్యలను తగ్గించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం కరివేపాకును, ఉల్లిపాయను పేస్ట్ గా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో గోరు వెచ్చగా చేసుకున్న ఆలివ్ నూనెను, నిమ్మరసాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ పేస్ట్ ను, కరివేపాకు పేస్ట్ ను వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టంతటికి పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ మిశ్రమం జుట్టుకు కండిషనర్ గా కూడా పని చేస్తుంది. ఈ విధంగా కరివేపాకును ఉపయోగించడం వల్ల మనకు వచ్చే జుట్టు సంబంధిత సమస్యలన్నీ తగ్గి జుట్టు అందంగా, ఆరోగ్యవంతంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.