Linga Donda : ప్రకృతి మనకు ప్రసాదించిన వనమూలికల్లో లింగదొండ మొక్క కూడా ఒకటి. కొండ ప్రాంతాలు, కంచెల వెంట విరివిరిగా లభించే ఈ మొక్కను ఆనాది కాలం నుండి మన పూర్వీకులు అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీనిని సంస్కృతంలో శివ మల్లిక, లింగ సంభూత, ఈశ్వరి అనే పేర్లతో పిలుస్తారు. లింగదొండ మొక్క కాయలు గుండ్రంగా గోళీ ఆకారంలో ఉండి కాయలపై తెల్లని చారలు ఉంటాయి. ఈ మొక్క గింజలు శివలింగం ఆకారంలో ఉంటాయి కనుక దీనికి లింగదొండ మొక్క అనే పేరు వచ్చింది.
శివలింగం ఆకృతిలో ఉండే ఈ మొక్క గింజలను ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు నెలసరి మొదలైనప్పటి నుండి పది రోజుల పాటు లింగదొండ మొక్క గింజల పొడిని స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు తొలగి సంతానం కలుగుతుంది. అదే విధంగా ఈ గింజల పొడిని ఆవు పాలతో కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యంతోపాటు వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
లింగదొండ మొక్క ఆకులను మెత్తగా నూరి చర్మంపై పూతగా రాయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఈ మొక్క సమూలాన్ని సేకరించి ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని సెగగడ్డలపై ఉంచి కట్టుకట్టడం వల్ల సెగగడ్డలు త్వరగా పక్వానికి వచ్చి చితికి పోతాయి. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి దానిలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, కఫం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. లింగదొండ మొక్క ఆకులతో కూరను వండుకుని కూడా తింటారు.
ఈ మొక్క ఆకులకు విషాన్ని హరించే శక్తి కూడా ఉంటుంది. పాము, తేలు వంటి విష కీటకాల కాటుకు గురి అయినప్పుడు లింగదొండ మొక్క వేరును మెత్తగా నూరి ఆ గంధాన్ని కాటుకు గురైన ప్రదేశంలో రాయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. శివలింగ మొక్క గింజలతో శివున్ని కూడా ఆరాధిస్తారు. ఈ గింజలను మాలగా గుచ్చి శివుని మెడలో వేయడం వల్ల శివుని అనుగ్రహాన్ని పొందగలమని చాలా మంది భావిస్తారు.