Dusara Mokka : గ్రామాలలో , రోడ్లకు ఇరు వైపులా, పొలాల గట్ల మీద, చెట్లకు అల్లుకుని పెరిగే తీగ జాతికి చెందిన మొక్కల్లో దూసర తీగ కూడా ఒకటి. చూడడానికి పిచ్చి మొక్కలా ఉండే ఈ దూసర తీగ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దూసర తీగ అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దీనిని విరివిరిగా ఉపయోగిస్తారు. ఈ తీగను ఉపయోగించి మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. దూసర తీగలో ఉండే ఔషధ గుణాలు ఏమిటి.. దీనిని ఉపయోగించి ఏయే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది శరీరంలో అధిక వేడి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ దూసర తీగ ఒక వరం లాంటిది. శరీరంలో ఉండే ఎంతటి వేడినైనా తగ్గించి శరీరానికి చలువ చేసే గుణాన్ని ఈ దూసర తీగ కలిగి ఉంటుంది.
దూసర తీగ ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి చేత్తో బాగా నలపాలి. కొద్ది సేపటికి ఆ నీరు జెల్ లా మారుతుంది. ఈ జెల్ ను రోజూ తినడం వల్ల శరీరంలో అధిక వేడి తగ్గుతుంది. ఈ జెల్ ను కళ్లు మూసుకుని కళ్ల పై ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల అలసటతోపాటు కళ్ల కింద నల్లని మచ్చలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా చేయడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తలనొప్పితో బాధపడే వారు ఈ జెల్ ను తినడం వల్ల తలనొప్పి త్వరగా తగ్గుతుంది. ఈ దూసర తీగ లేత ఆకులను తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా శరీరానికి కూడా శక్తి లభిస్తుంది.
గాయాలపై, పుండ్లపై ఈ దూసర తీగ ఆకుల రసాన్ని వేయడం వల్ల అవి త్వరగా మానుతాయి. నరాల బలహీనత ఉన్న వారు ఈ తీగ మొక్క ఆకుల రసాన్ని రెండు వారాల పాటు తాగడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మ సంబంధమైన సమస్యలతో బాధపడే వారు ఈ ఆకుల రసాన్ని చర్మంపై లేపనంగా రాయడం వల్ల సమస్యలు తగ్గుతాయి. మల, మూత్రాలలో రక్తం పడుతున్నప్పుడు ఈ దూసర తీగ ఆకుల రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ తీగ ఆకులను నీటిలో వేసి మరిగించి వడకట్టి ఆ నీటిని తాగడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుంది.
ఈ ఆకుల రసాన్ని లేదా నీటిలో వేసి నలపగా వచ్చిన జెల్ ను కాలిన గాయాలపై, విష పురుగులు కుట్టిన చోట ఉంచడం వల్ల నొప్పి, మంట నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో అధిక వేడితో బాధపడే వారు ఈ తీగ మొక్క ఆకుల రసాన్ని 20 ఎంఎల్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవడం వల్ల వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. ఈ విధంగా దూసర తీగను ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.