Gongura : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. గోంగూరతో పచ్చడి, పప్పు, గోంగూర రొయ్యలు, గోంగూర చికెన్, గోంగూర మటన్ వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాము. గోంగూర పచ్చడిని చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయని చెప్పవచ్చు. గోంగూరతో చేసే వంటకాలు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. అలాగే గోంగూరను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. గోంగూరలో ఉండే పోషకాల గురించి అలాగే దీని వల్ల మనకు అందే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గోంగూరను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే శరీరానికి కావల్సిన ఐరన్ లభిస్తుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తరచూ నీరసం, బలహీనత, నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడే వారు గోంగూరను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు కారణంగా గుండె, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. కనుక ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడం మంచిది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు గోంగూరను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అదే విధంగా గోంగూరను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇన్ఫెక్షన్స్ మన దరి చేరుకుండా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా అరికడతాయి. అలాగే దీనిలో క్యాల్షియం కూడా ఉంటుంది. కనుక గోంగూరను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో కూడా గోంగూర మనకు సహాయపడుతుంది. గోంగూరను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా గోంగూర మనకు ఎంతో సహాయపడుతుందని దీనిని వారానికి రెండు నుండి మూడుసార్లు తీసుకోవడం వలల్ మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.