Palarasam : మనం సాధారణంగా దోశ, అట్టు వంటి అల్పాహారాలను చట్నీ, పచ్చళ్లు, పప్పు వంటి వాటితో తింటూ ఉంటాము. ఇవే కాకుండా అట్టు వంటి వాటిని మనం స్వీట్ చట్నీతో కూడా తినవచ్చు. ఈ స్వీట్ చట్నీనే పాలరసం అని కూడా అంటారు. బియ్యం పిండితో చేసే ఈ వంటకం చలిమిడి మాదిరి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా గుంటూరులోని పల్నాడు ప్రాంతాలలో దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. పాలరసాని అట్టుతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ పాలరసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలరసం తయారీకి కావల్సిన పదార్థాలు..
అర గంట పాటు నానబెట్టిన బియ్యం – అర కప్పు, పాలు – పావు లీటర్, నీళ్లు – ఒక కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, మిరియాల పొడి – అర స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – 2 స్పూన్స్.
పాల రసం తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని పూర్తిగా వడకట్టి జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పాలు తీసుకోవాలి. ఇందులో మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు, బెల్లం తురుమును వేసి కలపాలి. తరువాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కళాయిని ఉంచి అందులో ఈ పాల మిశ్రమాన్ని వేసుకోవాలి. దీనిని చిన్న మంటపై కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం కొద్దిగా దగ్గర పడిన తరువాత యాలకుల పొడి, మిరియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి కలపాలి. దీనిని పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలరసం తయారవుతుంది. దీనిని దోశ, అట్టు వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ ఒకేరకం చట్నీలు కాకుండా ఇలా అప్పుడప్పుడూ ఈ స్వీట్ చట్నీని కూడా తయారు చేసుకుని తినవచ్చు.