Jilledu Chettu : మన కంటికి, మన చేతికి చేరువలో అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. కానీ వీటిని మనం పట్టించుకోము. అలాంటి మొక్కలలో జిల్లేడు మొక్క కూడా ఒకటి. ఇది మనకు విరివిరిగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ దీనిలో ఉండే ఔషధ గుణాల గురించి మనకు తెలియక ఈ మొక్కను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. జిల్లేడు చెట్టులో ఉండే ఔషధ గుణాలు, వ్యాధులను నయం చేయడానికి దీనిని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడపడితే అక్కడ పెరిగే ఈ జిల్లేడు చెట్టును పూర్వకాలంలో చుట్టలుగా చేసుకుని తాగేవారు. దీని ఆకులను ఆముదంలో వేయించి రసం పిండి ఆ రసాన్ని ముక్కులో వేయడం వల్ల జలుబు తగ్గుతుంది.
కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా జిల్లేడు మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క కషాయం చేదుగా ఉంటుంది. వేడి చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. సెగ రోగాలను, వ్రణాలను, చర్మ రోగాలను, వాతం, మూర్ఛ, సుఖ రోగాలను, పాము, తేలు విషాన్ని, దగ్గు, క్షయ వంటి మొదలైన సమస్త త్రిదోష వ్యాధులను జిల్లేడు మొక్క హరించి వేస్తుంది. 100 గ్రా. ల జిల్లేడు ఆకులను తీసుకుని వాటిని ముక్కలుగా చేయాలి. ఒక కళాయిలో 100 గ్రా. ల నువ్వుల నూనెను పోసి అందులో ఈ ఆకు ముక్కలను వేసి నల్లగా అయ్యే వరకు చిన్న మంటపై వేయించి వడకట్టాలి. ఈ తైలంలో 10 గ్రా. ల మిరియాల పొడి, 10 గ్రా. పిప్పిళ్ల పొడి, 10 గ్రా. ల ముద్ద కర్పూరం పొడి వేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి. దీనినే సూర్య తైలం అంటారు. ఈ తైలాన్ని అన్ని రకాల వాత నొప్పులపై రెండు పూటలా స్నానానికి గంట ముందు గోరు వెచ్చగా రాస్తూ ఉండడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ తైలాన్ని చర్మ వ్యాధులకు కూడా లేపనంగా వాడవచ్చు.
జిల్లేడు ఆకులకు ఆవు నెయ్యిని రాసి వేడి చేసి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని రెండు చుక్కల మోతాదులో రెండు ముక్కు రంధ్రాల్లోనూ వేయడం వల్ల తుమ్ములు వచ్చి పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. అలాగే ఈ రసాన్ని చెవులలో వేసుకోవడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా చెవిలో ఏదైనా పురుగు దూరినప్పుడు ఈ రసాన్ని వేయడం వల్ల పురుగు బయటకు వస్తుంది లేదా పురుగు చెవిలోనే చనిపోతుంది. నిమోనియా వల్ల, వాతం వల్ల ప్రక్కటెముకల్లో నొప్పి కలిగినప్పుడు జిల్లేడు ఆకుల రసాన్ని గోధుమ పిండిలో వేసి కలిపి చపాతీలా వెడల్సుగా చేసి దానిని ప్రక్కటెముకలపై ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుంది. జిల్లేడు పాలు, మర్రి పాలు, మాను పసుపు పొడిని కలిపి నూరి బంతిలాగా చేసి ఆ బంతులను ఎముకలలో పుట్టిన పుండ్లలో ఉంచి కట్టు కట్టడం వల్ల పుండ్లు తగ్గుతాయి. ఎవరైనా జిల్లేడు పాలను తాగితే అది ప్రాణాంతకం అవుతుంది. అలాంటప్పుడు ఒక అర లీటర్ నీటిలో 20 గ్రా. పల్లేరు చెట్టు సమూలాన్ని నూరి బాగా కలియబెట్టి వస్త్రంలో వడపోసుకోవాలి. ఆ నీటిలో బెల్లాన్ని కలిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉండడం వల్ల జిల్లేడు విషం హరించుకుపోతుంది.
కుళ్లి చీము కారే వ్రణాలను సైతం జిల్లేడు చెట్టును ఉపయోగించి నయం చేసుకోవచ్చు. జిల్లేడు ఆకులను ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని మొండి వ్రణాలపై చల్లడం వల్ల క్రమంగా వ్రణాలు తగ్గు ముఖం పడతాయి. ఒక గిన్నెలో నువ్వుల నూనెను పోసి బాగా మరిగించి అందులో జిల్లేడు ఆకుల రసాన్ని కలపాలి. ఇలా కలపడం వల్ల ఆ పాత్ర నుండి వెంటనే ఆవిరి బయటకు వస్తుంది. ఈ ఆవిరిని తేలు కుట్టిన అవయవానికి తగిలేలా చేయడం వల్ల ఎంతటి భయంకరమైన తేలు విషం అయినా కూడా హరించుకుపోతుంది. ఈ విధంగా జిల్లేడు చెట్టును ఉపయోగించి మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే జిల్లేడు చెట్టు గురించి పూర్తిగా తెలిసిన వారి సమక్షంలో లేదా ఆయుర్వేద నిపుణుల సమక్షంలో మాత్రమే ఈ చెట్టు భాగాలను ఉపయోగించాలి. లేదంటే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.