Tangedu Puvvu : తంగేడు మొక్క.. ఈ మొక్కకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మొక్క ఎక్కువగా బీడు నేలల్లో పెరుగుతుంది. తంగేడు పూలతో బతుకమ్మను తయారు చేసి పూజించే సంగతి మనందరికీ తెలిసిందే. తంగేడు పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని దీనిని ఉపయోగించి మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో.. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో తంగేడు పువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ చెట్టు ఆకులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి.
తంగేడు పూలు పసుపు రచ్చ రంగులో గుత్తులుగా పూస్తాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో తంగేడు పువ్వులు చక్కగా పని చేస్తాయి. పది గ్రాముల తంగేడు గింజల చూర్ణాన్ని రోజుకు రెండు పూటలా గోరు వెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే అతి మూత్రం సమస్యతో కూడా మనలో చాలా మంది బాధపడుతుంటారు. ఈ సమస్యను తగ్గించడంలో తంగేడు పువ్వులు ఎంతో సహాయపడతాయి. తంగేడు పువ్వులతో కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల అతి మూత్రం సమస్య తగ్గు ముఖం పడుతుంది.
ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో తంగేడు పువ్వులను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పూట తాగడం వల్ల అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. అదే విధంగా శరీరంలో అధికంగా ఉన్న వేడిని తగ్గించే గుణం కూడా తంగేడులో ఉంది.
తంగేడు పువ్వులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని గాయాలపై, పుండ్లపై లేపనంగా రాయడం వల్ల అవి త్వరగా మానుతాయి. ఈ విధంగా తంగేడు మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.