Spinach : పాలకూరను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. మనకు అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో ఇది ప్రముఖమైంది. దీన్ని పప్పు, టమాటా, కూర.. ఇలా రకరకాలుగా చేసుకుని తింటుంటారు. అయితే పాలకూరను పచ్చిగా తినవచ్చా.. తింటే ఏదైనా హాని జరుగుతుందా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. మరి ఇందుకు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగ్జలేట్స్ ఎక్కువగా కలిగిన ఆకుకూరలల్లో పాలకూర ఒకటి. పాలకూరలో 0.97 శాతం ఆగ్జాలిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆగ్జాలిక్ ఆమ్లం మన శరీరంలో ప్రవేశించినప్పుడు కాల్షియంతో కలిసిపోయి మన శరీరం కాల్షియంను గ్రహించకుండా చేస్తుంది. దీని వలన కిడ్నీలల్లో రాళ్లు ఏర్పడడమే కాకుండా మూత్రాశయంలో కాల్షియం స్పటికాలు ఏర్పడతాయి.
ఈ కాల్షియం స్పటికాలు తొందరగా కరిగిపోవు. దాని వలన కిడ్నీలలో, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడి మూత్రాశయ సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. పాలకూరను పచ్చిగా తినడం కంటే ఉడికించి తినడం చాలా మంచిది. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం.. పాలకూరను ఉడికించడం వలన 80 నుండి 90 శాతం ఆగ్జాలిక్ ఆమ్లాన్ని తగ్గించవచ్చు. దీని వలన మన శరీరంలోకి ప్రవేశించే ఆగ్జాలిక్ ఆమ్ల శాతం తగ్గుతుంది. ఫలితంగా కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. కనుక పాలకూరను పచ్చిగా తినడం కంటే ఉడికించి తినడమే మనకు చాలా మేలు చేస్తుంది.
అయితే పాలకూర జ్యూస్‌ను పచ్చిగానే తాగాలి కదా.. అనుకునేవారు.. ఒక గ్లాస్‌లో సగం వరకు జ్యూస్ తీసుకుని మిగిలిన సగం నీళ్లను కలపాలి. అనంతరం అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలపాలి. దీంతో ఆగ్జాలిక్ ఆమ్లం శాతం తగ్గుతుంది. ఇలా పాలకూరతో కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా సురక్షితంగా దాన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా జ్యూస్‌ను తాగినా.. సమస్య ఉండదు.