మాంసాహార ప్రియులు అత్యంత ఎక్కువగా తినే ఆహారాల్లో చికెన్ ఒకటి. దీంతో అనేక రకాల వంటకాలను చేసుకుని తింటుంటారు. అయితే చికెన్ అనగానే చాలా మందికి బ్రాయిలర్, నాటు కోళ్లు గుర్తుకు వస్తాయి. బ్రాయిలర్ కోళ్ల కన్నా నాటుకోళ్లు రుచిగా ఉంటాయి. అందువల్ల నాటుకోళ్లను తినేందుకు చాలా మంది ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అది సహజమే. అయితే కోడిగుడ్ల విషయానికి వస్తే ఫారం కోడి గుడ్లు మంచివా, నాటు కోడిగుడ్లా ? అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. మరి దీనికి సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందామా..!
ఫారం కోడిగుడ్లు అంటే లేయర్ కోళ్లు పెట్టేవి. వీటిని కోళ్ల ఫామ్‌లలో పెంచుతారు. ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తారు. కనుక లేయర్ కోళ్లు నాటు కోళ్ల కన్నా ఎక్కువ సంఖ్యలో గుడ్లను పెడతాయి. ఒక దఫా.. అంటే 20 నుంచి 72 వారాల సమయంలో ఒక్కో లేయర్ కోడి సుమారుగా 300కు పైగానే గుడ్లను పెడుతుంది.
అదే నాటుకోళ్ల విషయానికి వస్తే వాటికి ఫారం కోళ్లలా పోషకాహారం అందదు. రోజూ తమకు లభించిన ఆహారాలను తింటాయి. అందువల్ల అవి ఆ సమయంలో 80 నుంచి 150 గుడ్లను మాత్రమే పెడతాయి. అయితే రెండు గుడ్లకు చెందిన రంగు వేరేగా ఎందుకు ఉంటుంది ? అంటే.. నాటుకోళ్లు రోజూ తమకు దొరికిన ఆహారం తింటాయి. లేయర్ కోళ్లు అలా కాదు. వాటికి దాదాపుగా రోజూ ఒకే ఆహారం ఉంటుంది. కనుక నాటుకోళ్ల గుడ్లు సహజంగానే గోధుమ రంగులో ఉంటాయి.
ఇక పోషకాల విషయానికి వస్తే.. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చెప్పిన ప్రకారం.. లేయర్ కోళ్లు, నాటుకోళ్ల గుడ్లలో పోషకాలు సమానంగా ఉంటాయి. రెండింటిలోనూ ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ.. అనే తేడాలు ఉండవు. కాకపోతే నాటుకోళ్లు భిన్న రకాల ఆహారాలను తింటాయి కనుక వాటి గుడ్ల రంగు మారుతుంది. అంతేకానీ నాటుకోళ్లు, లేయర్ కోళ్ల గుడ్లలో ఉండే పోషకాలు ఒకేలా ఉంటాయి. ఎలాంటి తేడాలు ఉండవు. అందువల్ల రెండు కోడిగుడ్లు పోషకాల విషయంలో సమానమైనవే. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అనే భేదం లేదు. కనుక పోషకాలు కావాలంటే ఏ కోడిగుడ్డునైనా తినవచ్చు. నాటుకోడి గుడ్లనే తినాల్సిన పనిలేదు.
కానీ చాలా మంది నాటుకోళ్ల గుడ్లు మంచివి అంటారు. అది అపోహ మాత్రమే. అవి రుచిగా ఉంటాయి. అంతేకానీ పోషకాలు సాధారణ గుడ్లలో, నాటు కోళ్ల గుడ్లలో ఒకేలా ఉంటాయి. కనుక రెండూ మంచివే అని చెప్పవచ్చు.