సంపూర్ణ పౌష్టికాహారం అనగానే మనకు గుర్తుకు వచ్చేది పాలు. ఎందుకంటే దాంట్లో దాదాపుగా అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలలో మనకు శరీరానికి కావల్సిన విటమిన్లు ఎ, కె, బి12, థయామిన్, నికోటినిక్ యాసిడ్, కాల్షియం, పాస్ఫరస్, సోడియం, పొటాషియం వంటి కీలకమైన పోషకాలు ఉంటాయి. అవి మన శరీరానికి ఎంతో అవసరం. అయితే కొంత మంది పాలను ఉదయం తాగితే కొందరు సాయంత్రం, మరికొందరు రాత్రి తాగుతారు. ఈ క్రమంలో అసలు పాలను ఏ సమయంలో తాగితే మంచిదో ఇప్పుడు చూద్దాం.
ఆయుర్వేద ప్రకారం… పాలు మన శరీరానికి ఎంతో అవసరం. దీంతో మనకు కావల్సిన పోషకాలు లభిస్తాయి. వేడి పాలను నిత్యం తాగితే దాంతో అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఆయుర్వేదం చెబుతున్నదేమిటంటే ఉదయం పూట పాలను తాగకూడదు. ఎందుకంటే పాలలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. ఉదయం పనిలో బిజీగా ఉంటారు కనుక పాలను తాగకూడదు. మధ్యాహ్నం పూట పాలను తాగడం వృద్ధులకు మంచిది. అయితే వారే కాదు ఎవరైనా మధ్యాహ్నం పూట పాలు తాగవచ్చు. ఈ సమయంలో పాలను తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు పోతాయి. కిడ్నీస్టోన్ల సమస్య రాదు. కానీ ఆఫీసుల్లో పని చేసుకునే వారు మాత్రం మధ్యాహ్నం కూడా పాలు తాగకూడదు.
అదే సాయంత్రం పూట పాలను తాగితే కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దృష్టి సంబంధ సమస్యలు పోతాయి. అదేవిధంగా రాత్రిపూట పాలను తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. చక్కగా నిద్రపడుతుంది. ఉదయం లేచే సరికి శరీరానికి ఉత్తేజం కలుగుతుంది. తెలుసుకున్నారుగా, పాలను ఎప్పుడు తాగాలో! ఇంకెందుకాలస్యం, ఆ విధంగా మిల్క్ డైట్ ఫాలో అయిపొండి మరి!