ఉల్లిపాయలతో మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉల్లిపాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉల్లిపాయలను వాడవచ్చు. అవి ఘాటుగా ఉంటాయి. కొందరు రోజూ ఉల్లిపాయలను పచ్చిగానే తింటుంటారు. అయితే ఎంతో కాలం నుంచి అపోహ చాలా మందిలో నెలకొంది. అదేమిటంటే..
ఉల్లిపాయలను కట్ చేసి అలాగే చాలా సేపు ఉంచితే విషపూరితంగా మారుతాయని, అందువల్ల వాటిని కట్ చేశాక వెంటనే వాడాలని.. చాలా మంది ఇప్పటికీ నమ్ముతున్నారు. అయితే దీని గురించి సైంటిస్టులు ఏమని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. కనుక వాటిని కట్ చేశాక సూక్ష్మ జీవులపై పోరాటం చేస్తాయి. కానీ విషపూరితంగా మారవు. కాబట్టి ఉల్లిపాయలను కట్ చేశాక చాలా సేపు ఉంచితే అవి విషపూరితంగా మారుతాయి.. అని అంటున్నది అంతా అబద్దం.. అని ఫుడ్ సేఫ్టీ నిపుణులు, ప్రొఫెసర్ ఎల్లెన్ స్టెయిన్ బర్గ్ తెలిపారు.
ఇక ఇదే విషయమై అమెరికాకు చెందిన నేషనల్ ఆనియన్ అసోసియేషన్, యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకు చెందిన పరిశోధకులు కూడా వివరాలను వెల్లడించారు. ఉల్లిపాయలను కట్ చేసి చాలా సేపు ఉంచితే అవి విష పూరితంగా మారుతాయని అనడంలో ఎంత మాత్రం నిజం లేదని, అంతా అబద్దమని, ఇంటర్నెట్‌లో ఇలాంటి పుకార్లు చాలా వస్తున్నాయని, వాటిని నమ్మాల్సిన పనిలేదని అన్నారు.
అయితే ఉల్లిపాయలను కట్ చేసి వాటిని నేరుగా ఫ్రిజ్‌లో గానీ, ఇతర ఆహారాల వద్ద గానీ పెట్టరాదు. పెడితే ఆ ఆహారాలు త్వరగా పాడవుతాయి. కనుక ఉల్లిపాయలను కట్ చేశాక వాటిని ఒక సీల్డ్ కవర్‌లో ఉంచాలి. అనంతరం ఆ కవర్‌ను ఫ్రిజ్ లో పెట్టవచ్చు. దీంతో ఉల్లిపాయలు 7 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అంతేకానీ వాటిని కట్ చేశాక చాలా సేపు ఉంచితే అవి విషపూరితంగా మారుతాయని.. అనడంలో ఎంత మాత్రం నిజం లేదు. అదే జరిగితే రెస్టారెంట్లలో చాలా వరకు ఎప్పుడో కట్ చేసిన ఉల్లిపాయలను సర్వ్ చేస్తారు. కానీ వాటిని తినడం వల్ల ఎవరికీ ఏమీ కాలేదు. పైన చెప్పిందే నిజం అయితే ఎంతో మంది అస్వస్థతకు గురయ్యేవారు. అలా జరగ లేదంటే పైన చెప్పిన విషయం అబద్ధమని స్పష్టమవుతుంది. కనుక ఆ విషయం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు.