Sugarcane Juice : వేసవి వచ్చిందంటే చాలు.. చాలా మంది తమ శరీరాలను చల్లబరుచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే శీతల పానీయాలను, కొబ్బరినీళ్లను.. చల్లగా ఉండే ఇతర ద్రవాలు, ఆహారాలను అధికంగా తీసుకుంటూ ఉంటారు. ఇక మనకు వేసవిలో లభించే పానీయాల్లో చెరుకు రసం కూడా ఒకటి. రహదారుల పక్కన ఎక్కడ చూసినా చెరుకు రసాన్ని తయారు చేసి విక్రయించే వారు మనకు ఈ సీజన్‌లో అధికంగా కనిపిస్తుంటారు. వేసవిలో చల్ల చల్లని చెరుకు రసం తాగితే వచ్చే మజాయే వేరు.
చెరుకు రసం తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రసం తాగితే శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. దీంతో నీరసం, అలసట మొత్తం పోతాయి. చురుకు దనం లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఈ రసాన్ని తాగడం వల్ల వేసవి తాపం మొత్తం తగ్గుతుంది. శరీరంలోని వేడి అంతా తగ్గిపోతుంది. దీంతోపాటు ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు.
చెరుకు రసం తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. జీర్ణవ్యవస్థ, లివర్ శుభ్రంగా మారుతాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇలా చెరుకు రసంతో అనేక లాభాలను పొందవచ్చు. అయితే చెరుకు రసం తయారు చేసేవారు చెరుకు గడల మధ్యలో నిమ్మకాయలను పెడతారు. ఇలా ఎందుకు చేస్తారంటే..
చెరుకు గడలపై ఉండే ఆకులను, ఇతర వ్యర్థాలను తొలగించి.. గడలను శుభ్రం చేశాకే వాటిని మరలో పెట్టి రసం తీస్తారు. అయితే ఎంత శుభ్రం చేసినా గడలపై ఉండే బాక్టీరియా, ఇతర క్రిములు అంత త్వరగా పోవు. కనుక నిమ్మకాయ పెడితే ఆ రసంతో పాటు నిమ్మరసం కూడా అందులో కలుస్తుంది. దీంతో చెరుకు రసంలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. దీని వల్ల ఆ రసాన్ని మనం ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా తాగవచ్చు. మన ఆరోగ్యం కూడా దెబ్బ తినకుండా ఉంటుంది. విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
ఇక చెరుకు రసం తీసే సమయంలో గడల మధ్య నిమ్మకాయలను ఉంచడం వెనుక ఇంకో కారణం కూడా ఉంది. అదేమిటంటే.. మనం చెరుకు రసాన్ని నేరుగా అలాగే తాగరాదు. పైత్యం చేస్తుంది. కనుక నిమ్మరసం కలపాలి. దీంతో ఆ రసం మన శరీరంపై చెడు ప్రభావాన్ని చూపించదు. అందుకనే నిమ్మకాయలను చెరుకు గడల మధ్యలో పెట్టి రసం తీస్తారు. దీని వల్ల నిమ్మరసం కూడా చెరుకు రసంలో కలుస్తుంది. అలాంటి రసాన్ని తాగితే ఆరోగ్యంగా ఉంటారు. చెడు ప్రభావాలు కలగవు.
అయితే ఇంట్లో సహజసిద్ధంగా మనం చెరుకు గడలను తెచ్చి రసం తయారు చేసుకున్నా సరే.. ఒక గ్లాస్ చెరుకు రసంలో 2 టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. ఆ తరువాతే ఆ రసాన్ని తాగాలి. దీంతో ఎలాంటి దుష్పరిణామాలు కలగకుండా.. సూక్ష్మ క్రిముల వల్ల ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. సురక్షితంగా చెరుకు రసాన్ని తాగవచ్చు..!