ఆరోగ్యానికి నడక మంచిదా? పరుగు మంచిదా? అన్న చర్చ పాత కాలంనాటినుండి కొనసాగుతూనే వుంది. దేనికదే మంచిదిగా చెప్పాలి. రెండూ కూడా వేరు వేరు వ్యాయామాలే. తీవ్రత మారుతూంటుంది. నడిస్తే కొన్ని ప్రయోజనాలు కాగా జోగింగ్ చేయటం వలన మరి కొన్ని ఇతర ప్రయోజనాలుగా పొందవచ్చు. కనుక రెండిటిని పోల్చటం సరికాదు. అయితే రెండూ వ్యాయామాలే అన్న విషయం గుర్తిస్తే చాలు. ఈ రెండు వ్యాయామాలలోను వున్న మంచి ప్రయోజనాలను పరిశీలిద్దాం…… ఈ రెండు వ్యాయామాల మధ్య ప్రధానంగా వున్న తేడా తీవ్రత. పరుగు లేదా జోగింగ్ నడకకంటే శ్రమ కలిగించేది. కనుక బరువు తగ్గటం అనేది జోగింగ్ లో నడక కంటే కూడా మెరుగైనదే.
అలాగని నడక ఏదో విశ్రాంతిగా చేసేది కాదు. పార్కులో స్నేహితులతో కలసి షికారు గా చేసేది కాదు. నడక అనేది వ్యాయామంగా చేస్తేనే నడక అవుతుంది. లేదంటే నడకకుగల ప్రయోజనాలు మీకు రావు. నడక అనేది ఒంటరిగానే చేయాలి. ఎవరితోనైనా కలిస్తే, వారి వేగానికి ఎక్కువైనా, తక్కువైనా సరే మీరు రాజీ పడాలి. వేగం తగ్గితే మీ సామర్ధ్యం తగ్గుతుంది. వేగమెక్కువైతే ముందుగానే మీరు అలసిపోతారు. కనుక నడక ప్రయోజనాలు మీకు రావాలంటే, ఒంటరిగానే నడవండి. జోగింగ్ ప్రయోజనాలు చూస్తే, అధికబరువుకై జోగింగ్ సత్వర ఫలితమిస్తుంది. గుండెకు చాలా మంచి వ్యాయామం. గుండె నుండి అధిక రక్తం సరఫరా అవుతూంటుంది. ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. చిన్నవయసులో ఇది ఎంతో ప్రయోజనకరం.
నడక మంచిదా లేక జోగింగ్ మంచిదా అనేది మీకు కావలసిన ఫలితాన్ని బట్టి చేయాలి. బరువు సమస్యలేదు…ఫిట్ గా వుండాలి. అపుడు మీకు వాకింగ్ మంచిది. బరువు అధికం…వేగంగా తగ్గించాలి. జోగింగ్ చేయండి. వాకింగ్ లో ఫలితాలు సత్వరమే రావు. మరో విషయంగా మీరు ఏ వయసులో వున్నారనేది కూడా ఆలోచించాలి. యువతకు జోగింగ్ మంచిది. వీరు నడిస్తే కండరాలు సడలుతాయి. బిగువు కొరకు వీరు పరుగెత్తాల్సిందే. వయసు 50 సంవత్సరాలు పైబడితే వేగవంతమైన నడక మంచిది. గుండెపై ఒత్తిడి ఈ వయసులో మంచిది కాదు. కనుక చర్చ కొనసాగుతున్నప్పటికి, పై అంశాల పరిశీలనతో మీకు కొంత అవగాహన ఏర్పడే వుంటుంది.