వేసవికాలంలోనే కాదు.. సహజంగా ఏ కాలంలో అయినా సరే ఎండలో తిరిగితే కొందరి చర్మం కందిపోతుంది. కొందరికి చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఎర్రగా మారుతుంది. దీంతో చర్మం దురద పెడుతుంది. ఇక ఎక్కువ సమయం పాటు ఎండలో తిరగడం వల్ల చర్మం దెబ్బ తింటుంది. నల్లగా మారుతుంది. అలాగే దీర్ఘకాలంలో అయితే చర్మ క్యాన్సర్లు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఈ సమస్యలను తగ్గించుకోవాలంటే నిత్యం ద్రాక్షలను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
నిత్యం ద్రాక్షలను తినడం వల్ల ఎండలో తిరిగినా చర్మానికి ఏమీ కాదని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. నిత్యం వారు కొంత మందికి సుమారుగా రెండున్న కప్పుల ద్రాక్షలను తినమని ఇచ్చారు. తరువాత వారు ఎండలో తిరిగారు. అనంతరం వారి చర్మాన్ని పరిశీలించారు. ద్రాక్షలను తినకుండా ఎండలో తిరిగిన వారితో పోలిస్తే ద్రాక్షలను తిని ఎండలో తిరిగిన వారి చర్మం సురక్షితంగా ఉందని తేల్చారు. అందువల్ల ఎండ బారి నుంచి చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే నిత్యం ద్రాక్షలను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
అయితే ద్రాక్షల వల్ల ఈ ప్రయోజనం కలగాలంటే ఎండలో వెళ్తామని అనుకునే దాని కంటే 24 గంటల ముందు ఈ పండ్లను తినాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు రేపు ఉదయం మీరు బయట తిరగాల్సి వచ్చిందనుకుందాం. అప్పుడు ఎండ నుంచి సురక్షితంగా ఉండాలంటే ఈ రోజు ఉదయం మీరు ద్రాక్షలను తినాలి. అలాగన్నమాట. అంటే నిత్యం.. ఎండలో తిరిగేవారు రోజూ ద్రాక్షలను తింటే ఫలితం ఉంటుందన్నమాట. ఈ మేరకు సైంటిస్టులు తమ పరిశోధనలకు చెందిన వివరాలను అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.