పాలు, పాల సంబంధ పదార్థాలను నిత్యం రెండు పూటలా తీసుకుంటే డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. పాలు, పెరుగు, చీజ్ తదితర పదార్థాలను నిత్యం రెండు సార్లు తీసుకోవడం వల్ల ఆయా అనారోగ్యాలకు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సైంటిస్టులు తేల్చారు. ఈ మేరకు వారి అధ్యయన వివరాలను ది బీఎంజే ఓపెన్ డయాబెటిస్ రీసెర్చ్ అండ్ కేర్ అనే జర్నల్‌లో ప్రచురించారు.
21 దేశాలకు చెందిన 35 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 1,13,000 వేల మందిని సంవత్సరం పాటు పరిశీలించి వారి వివరాలను సైంటిస్టులు తెలుసుకున్నారు. వారు నిత్యం తీసుకునే ఆహార పదార్థాల వివరాలు, వారికున్న అనారోగ్య సమస్యలు తదితర అనేక విషయాలను సేకరించారు. ఈ క్రమంలో నిత్యం పాలు, పాలు సంబంధ పదార్థాలను రెండు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకునే వారి ఆరోగ్యాన్ని, అవి తినని వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. దీంతో ఆసక్తికర విషయాలు తెలిశాయి.
నిత్యం పాలు లేదా పాల సంబంధ పదార్థాలను కనీసం రెండు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకుంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు 24 శాతం వరకు తక్కువగా ఉంటాయని తేల్చారు. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారు. నిత్యం పాలు లేదా పాల సంబంధ పదార్థాలను తీసుకోని వారిలో 5351 మందికి డయాబెటిస్, హైబీపీ వచ్చినట్లు నిర్దారించారు. కనుక ఆయా ఆహార పదార్థాలను నిత్యం రెండు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకుంటే ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.