మనలో కొందరు రాత్రి పూట ఆలస్యంగా నిద్రిస్తారు. దీంతో సహజంగానే మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఈ క్రమంలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లను కూడా ఆలస్యంగానే పూర్తి చేస్తారు. అయితే ఇలా చేయడం అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కానీ బ్రేక్‌ఫాస్ట్‌ను రోజూ ఉదయం 8.30 గంటల లోపు పూర్తి చేస్తే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.
మొత్తం 10,575 మందికి చెందిన వివరాలను సైంటిస్టులు సేకరించి అధ్యయనాల్లో భాగంగా విశ్లేషించారు. దీంతో తేలిందేమిటంటే.. ఉదయం 8.30 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేసేవారికిలో షుగర్ లెవల్స్ అదుపులో ఉన్నాయని, వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గాయని, ఇన్సులిన్ నిరోధకత తగ్గిందని గుర్తించారు. అందువల్ల వీలైనంత త్వరగా బ్రేక్‌ఫాస్ట్‌ను ముగించేయాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో పిండి పదార్థాలు తక్కువగా, కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సైంటిస్టులు తెలిపారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా అదుపులో ఉంటాయని చెప్పారు. ఈ విధమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందన్నారు. ఈ మేరకు సైంటిస్టులు తమ అధ్యయనాల తాలూకు వివరాలను ఎండోక్రైన్ సొసైటీ వార్షిక సమావేశంలో వెల్లడించారు.