సంతానం పొందాలని చాలా మంది మహిళలు అనుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రం ఆ భాగ్యానికి నోచుకోరు. అందుకు కారణాలు అనేకం ఉంటాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది ఎండోమెట్రియోసిస్. అంటే గర్భాశయానికి బయటి వైపున ఓ రకమైన కణజాలం పెరుగుతుంది. దీని వల్ల తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. రుతు సమస్యలు వస్తాయి. రుతు క్రమం సరిగ్గా ఉండదు. ఒక్కోసారి అండాలు పక్వదశకు రాకుండానే దెబ్బతింటాయి. దీంతో సంతానం కలిగేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే పలు ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎండోమెట్రియోసిస్ సమస్యను అధిగమించవచ్చని తెలిసింది.
సౌతాంప్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎండోమెట్రియోసిస్ కు సంబంధించి ఎలుకలపై పలు ప్రయోగాలు చేశారు. అందులో తెలిసిందేమిటంటే ద్రాక్ష పండ్లు, వేరు శెనగ, బ్లూబెర్రీలలో ఉండే పలు రకాల పదార్థాలు ఎలుకల్లో వచ్చే ఎండోమెట్రియోసిస్ సమస్యకు విరుగుడుగా పనిచేశాయట. దీంతో వారు ఏం చెబుతున్నారంటే మహిళలు ద్రాక్ష పండ్లు, వేరు శెనగ, బ్లూబెర్రీ వంటి పండ్లను తింటే వారిలో వచ్చే పై సమస్య తగ్గుముఖం పడుతుందట. దీంతో సంతానం కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ద్రాక్ష పండ్లలో మాంగనీస్, పొటాషియం, విటమిన్ కె, సి, బి1 వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వేరుశెనగలో నియాసిన్, మాంగనీస్‌లు పుష్కలంగా దొరుకుతాయి. అదే బ్లూబెర్రీలలో అయితే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ కె, సి, మాంగనీస్ వంటివి ఉంటాయి. ఈ క్రమంలో ఆయా పదార్థాలను తీసుకోవడం వల్ల మహిళల్లో రుతు సంబంధ సమస్యలు రావట. ఇప్పటికే అలాంటి సమస్య ఉన్నవారు కూడా ఆయా ఆహారాన్ని తింటే ఫలితం ఉంటుందని సదరు సైంటిస్టులు చెబుతున్నారు. దీంతోపాటు నిత్యం చాలినంత నిద్ర కూడా పోతే మహిళలు వెంటనే గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందట.