Solar Eclipse : సూర్య, చంద్ర గ్రహణాలు అనేవి సహజంగానే ఎల్లప్పుడూ ఏర్పడుతూనే ఉంటాయి. అయితే సంపూర్ణ గ్రహణాలు మాత్రం ఎప్పుడో ఒకసారి ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే శనివారం, డిసెంబర్ 4వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏం చేయాలి, ఏం చేయకూడదు.. అనే పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనివారం ఉదయం 10 గంటల 59 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 7నిమిషాలకు ముగుస్తుంది. ఈ క్రమంలో ఏ ఆలయం అయినా సరే మూసి ఉంటుంది. గ్రహణం రోజున ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. గ్రహణ సమయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
గ్రహణ సమయంలో గర్భిణీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. ఒకవేళ బయటకు వెళితే కడుపులోని బిడ్డపై సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకరమైన కిరణాలు ప్రభావం చూపుతాయని అంటున్నారు. సూర్యగ్రహణం రోజు భూమిపై పడే నీడకు గర్భిణీలు దూరంగా ఉండాలి. గ్రహణం ముగిసిన తర్వాత గర్భిణీలు వెంటనే స్నానం చేయాలి. దీంతో గ్రహణం వల్ల ఏమైనా దోషాలు ఏర్పడితే అవి తొలగిపోతాయి.
గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదు. గర్భిణీలు పండ్లు తీసుకోవచ్చు. గ్రహణ సమయంలో పదునైన వస్తువులను దూరంగా ఉంచాలి. గ్రహణం ఉన్నంత సేపు గర్భిణీలు శివ మంత్రాన్ని జపించడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. దీంతో దోషాలు తొలగిపోతాయని అంటున్నారు.