ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ సైబర్ క్రైమ్ చేసే వాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. రోజుకో కొత్త పద్ధతిలో ప్రజల డబ్బును లూటీ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చిందనో, లేక మీరు తప్పు చేశారని, అరెస్టు అవబోతున్నారనో లేక మరేదైనా కారణం చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారిని మోసం చేసి మరీ డబ్బును కాజేస్తున్నారు. దీంతో బాధితులు కొన్ని కోట్ల రూపాయలను ఇప్పటి వరకు నష్టపోయారు. ప్రతి 10 సెకన్లకు ఒక సైబర్ క్రైమ్ జరుగుతూనే ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సైతం చెబుతోంది. అయితే ప్రస్తుతం మరో కొత్త తరహా సైబర్ క్రైమ్ వెలుగు చూసింది.
మనకు రోజూ అనేక రకాల కాల్స్ వస్తుంటాయి. అయితే మీకు కానీ +67 లేదా +670 ఇలాంటి నంబర్లతో ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయా. అయితే జాగ్రత్త. ఈ ఫోన్ కాల్‌ను మీరు లిఫ్ట్ చేస్తే చాలు మీ బ్యాంకు ఖాతాల్లో ఉండే నగదును మొత్తం కాజేస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కాల్స్ చాలా మందికి వస్తున్నాయి. ఇప్పటికీ వీరి బారిన పడి అనేక మంది డబ్బును పోగొట్టుకున్నారని పోలీసులు చెబుతున్నారు. కనుక మీకు ఈ నంబర్ల నుంచి కాల్స్ వస్తుంటే అసలు లిఫ్ట్ చేయకండి.
ఈ నంబర్స్ నుంచి వచ్చే కాల్స్‌ను మీరు లిఫ్ట్ చేస్తే మీ నంబర్ డీయాక్టివేట్ అవుతుందని భయపెట్టి మిమ్మల్ని కీప్యాడ్ లేదా డయలర్‌పై 1 లేదా 2 ఇలా నంబర్లను ప్రెస్ చేయమని చెబుతారు. ఒకవేళ మీరు అలాగే చేస్తే వెంటనే మీ బ్యాంకు అకౌంట్లలో ఉండే నగదు మాయం అవుతుంది. ప్రస్తుతం చాలా మందికి ఇలాగే జరుగుతుందని, కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పైన తెలిపిన ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే వెంటనే కట్ చేయాలని, అవసరం అనుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు సూచిస్తున్నారు. కాబట్టి ఈ నంబర్లతో జాగ్రత్తగా ఉండండి.