Diabetes : ప్రస్తుత తరుణంలో చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అస్తవ్యస్తమైన జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ ఏమాత్రం చేయకపోవడం, అధిక బరువు, థైరాయిడ్ సమస్యలు, వేళకు నిద్రించకపోవడం, తగినంత నీటిని తాగకపోవడం.. వంటివన్నీ డయాబెటిస్ వచ్చేందుకు కారణమవుతున్నాయి.
డయాబెటిస్ వచ్చిన వారు తప్పనిసరిగా ఆహారం, నిద్ర విషయంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రోజూ శారీరక శ్రమ చేయాలి. దీంతోపాటు డాక్టర్ల సూచన మేరకు మందులను వాడుకోవాలి. ఇలా చేస్తే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
అయితే షుగర్ ఉన్నవారికి యోగాలో బాలాసనం అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని వేయడం కూడా చాలా సులభమే బాలాసనం ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా నేలపై మోకాళ్ల మీద కూర్చోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. అనంతరం రెండు చేతులను పైకెత్తి అలాగే ముందుకు వంగాలి. రెండు అరచేతులను నేలపై ఉంచాలి. ముఖంలో నుదురు నేలకు తాకేలా ఆసనం వేయాలి. కళ్లతో నేలను చూడాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. మళ్లీ సాధారణ స్థితికి రావాలి.
ఈ విధంగా బాలాసనాన్ని రోజుకు వీలైనన్ని సార్లు వేయవచ్చు. ఆరంభంలో 5 నిమిషాలతో మొదలు పెట్టి తరువాత నెమ్మదిగా సమయాన్ని పెంచుతూ పోవాలి. కనీసం రోజుకు 20 నిమిషాల పాటు ఈ ఆసనాన్ని వేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
బాలాసనం వేయడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ అదుపులోకి వస్తుంది. అలాగే వెన్ను సమస్యలు తగ్గుతాయి. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
భుజాలు, మెడ, కీళ్లు, కండరాల నొప్పులు ఉన్నవారు ఈ ఆసనం రోజూ వేస్తే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. నిద్రలేమి తగ్గుతుంది. విపరీతమైన కోపం ఉన్నవారు ప్రశాంతంగా మారుతారు. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా బాలాసనంతో ప్రయోజనాలు పొందవచ్చు.