Bheemla Nayak : ప్రస్తుత తరుణంలో దర్శక నిర్మాతలు సినిమాలను తీస్తున్న సమయంలో చాలా జాగ్రత్త వహించాల్సి వస్తోంది. ముఖ్యంగా డైలాగ్స్, సన్నివేశాలు, పాటల పరంగా అనేక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఏర్పడింది. చిన్న మాట తప్పుపోయినా ఏదో ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బ తింటున్నాయి. ఇది ప్రస్తుతం పరిపాటిగా మారింది. ఇక భీమ్లా నాయక్ చిత్రం కూడా ఇలాంటి ఓ వివాదంలో చిక్కుకుంది.
భీమ్లా నాయక్ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేషరీతిలో స్పందన లభిస్తోంది. అయితే కుమ్మరి, శాలివాహన వర్గాలకు చెందిన వారు సినిమాలో ఉన్న ఓ సీన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారు భీమ్లానాయక్ మేకర్స్‌పై ఫిర్యాదు చేశారు.
ఇరు వర్గాలకు చెందిన కార్పొరేషన్ల చైర్మన్ పురుషోత్తం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భీమ్లా నాయక్ సినిమాలో దగ్గుబాటి రానా కుండలను తయారు చేసే చక్రాన్ని తంతాడు. ఈ క్రమంలో ఆ సీన్ తమను అవమానించేవిధంగా ఉందని అన్నారు.
కుమ్మరి చక్రం తమకు జీవనాధారమని, దాన్ని తాము నిత్యం పూజిస్తామని తెలిపారు. అది తమకు గర్వకారణమని.. అలాంటి దాన్ని తన్ని అవమానించారని అన్నారు. ఆ సీన్‌పై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల ఆ సీన్‌ను తొలగించాలన్నారు.
కాగా పురుషోత్తం గుంటూరు అర్బన్ ఎస్‌పీకి ఈ మేరకు తమ ఫిర్యాదును అందజేశారు. చిత్ర మేకర్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై భీమ్లా నాయక్ మేకర్స్ ఇంకా స్పందించాల్సి ఉంది.