Sreesanth : జీవితం మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. అలాగే మనకు తెలిసిన వారి జీవితాల్లో జరిగే సంఘటనలు కూడా మనకు పాఠాలుగా ఉపయోగపడుతుంటాయి. అలాంటి వారు చేసే తప్పులను మనం చేయకుండా మన జీవితాన్ని అందంగా మార్చుకునేందుకు ఆ పాఠాలు ఉపయోగపడతాయి. అయితే కొందరు ఆ పాఠాలను నేర్చుకోరు. దీంతో వారి జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. దారం తెగిన గాలిపటంలా వారి జీవితం ఎటు వెళ్తుందో వారికే తెలియదు. ఇప్పుడు క్రికెటర్.. సారీ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పరిస్థితి కూడా అలాగే మారిందని చెప్పవచ్చు.
శంతకుమరన్ నాయర్ శ్రీశాంత్.. అందరూ శ్రీశాంత్ అని పిలుచుకునేవారు.. ఏదీ.. అతను ఫిక్సింగ్ కు పాల్పడకుండా కెరీర్‌ను సరిగ్గా కొనసాగించి ఉంటే.. అతనికిప్పుడు అన్ని గౌరవ మర్యాదలు కాస్తో కూస్తో దక్కేవి. కానీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడడం.. ఆ తరువాత కోర్టు కేసులు.. అతని నిషేధాన్ని తగ్గించడం.. అతను మళ్లీ క్రికెట్ లోకి రావడం.. చకచకా జరిగిపోయాయి. దీంతో తాను క్రికెట్ ఆడుతానని.. మళ్లీ తనకు పూర్వ వైభవం వస్తుందనే శ్రీశాంత్ కలలు కన్నాడు. కానీ అతని కలలు కల్లలు అయ్యాయి. చివరకు మళ్లీ క్రికెట్ ఆడకుండానే తన కెరీర్ ను ముగించేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.
శ్రీశాంత నిర్ణయం సరైందే అయినా.. అతను ఈ విధంగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఉండకూడదు. ఒకప్పుడు బ్యాట్స్‌మెన్‌ను తన బౌలింగ్ అటాక్‌తో గడగడలాడించాడు. కానీ అతను చేసిన ఒక తప్పు.. అతని జీవితాన్నే మార్చేసింది. ఫలితంగా ఇప్పుడు అవమాన భారంతో.. బరువెక్కిన హృదయంతో క్రికెట్‌కు అంతిమ వీడ్కోలు పలకాల్సి వచ్చింది. నిజంగా ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. ఇతర క్రికెటర్లు కొందరు ఫిక్సింగ్ కు పాల్పడి తప్పులు చేసి జీవితాన్ని నాశనం చేసుకున్నా.. ఆ పాఠాలను శ్రీశాంత్ నేర్వలేదు. లేదంటే ఇప్పుడతని రిటైర్మెంట్ మరోలా ఉండేది..!