వెక్కిళ్లు అనేవి సహజంగానే మనలో అధిక శాతం మందికి అప్పుడప్పుడు వస్తుంటాయి. వెక్కిళ్లు వస్తే అసలు ఏం చేయాలో అర్థం కాదు. మనకు తెలిసిన చికిత్స నీళ్లు తాగడం. గుటకలు మింగుతూ నీళ్లు తాగుతాం. దీంతో చాలా వరకు వెక్కిళ్లు తగ్గిపోతాయి. అయితే కొన్నిసార్లు నీటిని తాగినా వెక్కిళ్లు తగ్గవు. దీంతో ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది.
అయితే ఎవరికైనా వెక్కిళ్లు ఎందుకు ఏర్పడుతాయి ? అనే విషయంపై సైంటిస్టులు ఇప్పటికీ సరైన కారణం చెప్పలేదు. కానీ పలు కారణాల వల్ల వెక్కిళ్లు వస్తాయని మాత్రం చెప్పారు. అవేమిటంటే…
* శీతల పానీయాలు, సోడా వంటివి ఎక్కువగా తాగడం
* మద్యం విపరీతంగా సేవించడం
* పొగ తాగడం
* లోపలికి పీల్చే గాలి కన్నా బయటకు వదిలే గాలి శాతం ఎక్కువగా ఉండడం
* బాగా వేగంగా తినడం, ఎక్కువగా తినడం
* సడెన్ గా శరీర ఉష్ణోగ్రతలో మార్పులు
* బాగా చల్లగా లేదా బాగా వేడిగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల
* తీవ్రమైన భయం, ఒత్తిడి, ఆందోళన, ఎక్సైట్‌మెంట్‌కు గురవడం వల్ల
పైన తెలిపిన సందర్భాలతోపాటు కొందరికి బాగా ఏడ్చినప్పుడు, సాధారణంగా తినేటప్పుడు కూడా వెక్కిళ్లు వస్తాయి. అయితే కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే వెక్కిళ్లను తగ్గించుకోవచ్చు. అవేమిటంటే…
1. ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. లోపలికి గాలిని బాగా పీల్చాలి. దాన్ని అలాగే హోల్డ్ చేసి 10 సెకన్ల పాటు ఉంచాలి. తరువాత నెమ్మదిగా శ్వాసను విడవాలి. పూర్తిగా శ్వాసను వదలకుండానే మళ్లీ 5 సెకన్ల పాటు అలాగే గాలిని అదిమిపట్టి ఉంచాలి. తరువాత గాలిని పూర్తిగా విడవాలి. ఈ టెక్నిక్‌ను డాక్టర్ లక్ జి.మోరిస్ సూచించారు. దీన్ని పాటించడం వల్ల వెక్కిళ్లు తగ్గిపోతాయి.
2. నడుమును సగం వరకు వంచి నేలపై లేదా టేబుల్‌పై ఉన్న గ్లాస్ లోని నీటిని తాగాలి. అందుకు అవసరం అయితే స్ట్రా పెట్టి తాగవచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎంతటి మొండి వెక్కిళ్లు అయినా ఇట్టే తగ్గిపోతాయి. కానీ ఈ చిట్కాను చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది.
3. ఏ చిట్కాను పాటించినా వెక్కిళ్లు తగ్గకపోతే.. సుదీర్ఘమైన సమయం నుంచి వెక్కిళ్లు వస్తుంటే ఈ చిట్కాను పాటించాలి. దీని గురించి ఆయుర్వేదంలో ఇచ్చారు. ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ ఆముదం నూనెను తీసుకుని రెండింటినీ కలపాలి. ఆ మిశ్రమంలో వేలిని ముంచి అనంతరం ఆ వేలిని నాకాలి. ఇలా 2 నుంచి 3 సార్లు చేయాలి. దీంతో వెక్కిళ్లు తగ్గుతాయి.
4. చేదు, వగరు, పులుపు కలగలిపిన పండ్లను తినడం వల్ల కూడా వెక్కిళ్లు ఆగిపోతాయి. ఇలాంటి పండ్ల జాబితాలో గ్రీన్ ఆలివ్స్ మొదటి వరుసలో నిలుస్తాయి. వీటిని సూపర్ మార్కెట్లలో విక్రయిస్తారు.
5. వెక్కిళ్లు బాగా వస్తుంటే నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి. అనంతరం వాటిని మడిచి మోకాళ్లను ఛాతి వద్దకు తేవాలి. ఇలా కొంత సేపు ఉండాలి. దీంతో వెక్కిళ్లు ఆగిపోతాయి.
ఈ చిట్కాలను పాటించినా వెక్కిళ్లు తగ్గకపోతే తీవ్రమైన సమస్య వచ్చినట్లు గుర్తించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.