RRR Story : రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా నడుస్తోంది. ఈ మూవీ విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గురువారం అర్థరాత్రి నుంచే పలు చోట్ల బెనిఫిట్ షోలు ప్రారంభం కానున్నాయి. బ్లాక్‌లో ఈ మూవీ టిక్కెట్లను ఒక్కోటి రూ.5000 కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ గురించి కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్ మూవీకి చెందిన అసలు కథ వివరాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ విజయేంద్ర ప్రసాద్ అసలు కథ ఏమిటో చెప్పేశారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రాణస్నేహితులని అన్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణమని, కానీ ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉంటాయని తెలిపారు. ఇద్దరూ వ్యతిరేక ధ్రువాలుగా ఉంటారు. కానీ ఓ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇద్దరూ కొట్టుకుంటారు. ఇక సినిమా చూసే వాళ్లంతా వాళ్లిద్దరూ కొట్టుకోకుండా ఉంటే బాగుంటుంది కదా.. అని అనుకుంటారు, కానీ వారిద్దరూ కొట్టుకునే సీన్లను వీక్షకులు ఎంజాయ్ చేస్తారు.
ఇక వారు ఇద్దరూ కొట్టుకునేటప్పుడు రెండు సింహాలు దెబ్బలాడుకుంటున్నట్టు అనిపిస్తుంది.. అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఇక సినిమాలో ఇలాంటి ఫైట్స్ చూసి ఎంజాయ్ చేయాలి కానీ తనకు బాగా ఏడుపొచ్చింది అని అన్నారు. తాను ఈ సినిమాను ఐదు సార్లు చూశానని, ప్రతి సారీ ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటుంటే కన్నీళ్లు వచ్చాయని అన్నారు. ప్రేక్షకులకు కూడా ఈ సన్నివేశాల్లో కన్నీళ్లు వస్తాయని అన్నారు.
ఇక ఈ మూవీలో ఎన్‌టీఆర్, చరణ్ ఇద్దరినీ స్వాతంత్య్ర సమరయోధుల పాత్రల్లో చూపించారు. కనుక ఇద్దరూ ముందు వ్యతిరేక ధ్రువాల్లా ఉన్నా.. తరువాత కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తారని.. అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందా.. అని ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.