Yoga : యోగాలో అనేక రకాల ఆసనాలు అందుబాటులో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఒక్కో ఆసనం వేయడం వల్ల భిన్నరకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఎవరికి వీలైనట్లు యోగా ఆసనాలను వేస్తుంటారు. కొన్ని కష్టమైన ఆసనాలు ఉంటాయి. కొన్ని సులభతరం అయిన ఆసనాలు ఉంటాయి. ఇక ప్రత్యేకంగా స్త్రీ, పురుషుల కోసం వేర్వేరు ఆసనాలు ఉంటాయి. వాటిని వేయడం వల్ల వారికి వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఇప్పుడు చెప్పబోయే ఆసనం పురుషులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఆ ఆసనం ఏమిటి ? దాన్ని ఎలా వేయాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
పురుషులకు గోరక్షాసనం వేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఆ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా నేలపై పద్మాసనంలో కూర్చోవాలి. తరువాత చిత్రంలో చూపినట్లుగా రెండు చేతులను రెండు మోకాళ్లపై ఉంచాలి. పాదాలను రెండింటినీ దగ్గరికి తెచ్చి ఒకదానికి ఒకటి అతికించినట్లు పెట్టాలి. తరువాత రెండు చేతులను మోకాళ్ల మీద నుంచి తీసి కుడి చేత్తో ఎడమ మడమను, ఎడమ చేత్తో కుడి మడమను చిత్రంలో చూపినట్లుగా పట్టుకోవాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. రోజూ ఈ ఆసనాన్ని కనీసం 10 నిమిషాల పాటు వేస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
గోరక్షాసనం వేయడం వల్ల కలిగే లాభాలివే..
ఈ ఆసనం వేయడం వల్ల పురుషులకు ఎంతగానో మేలు జరుగుతుంది. దీంతో పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. శృంగార సమస్యలు పోతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. సంతాన లోపం ఉన్నవారు ఈ ఆసనం వేస్తే తప్పక ఫలితం ఉంటుంది. ఇక ఈ ఆసనం వేయడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా రోజూ వేస్తుంటే స్త్రీలలోనూ గర్భాశయ సమస్యలు పోతాయి. జీర్ణాశయంలో ఉండే గ్యాస్ మొత్తం దెబ్బకు బయటకు వస్తుంది. అలాగే పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. అక్కడి కండరాలు దృఢంగా మారుతాయి.
ఇక మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, మడమల నొప్పులు ఉన్నవారు, పేగుల్లో సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయరాదు.