Ragi Upma : మనకు అందుబాటులో లభించే తృణ ధాన్యాలలో రాగులు ఒకటి. రాగులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అధికంగా ఉన్న బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. రాగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్, బీపీ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. రాగులను పిండిగా చేసి మనం జావ, రొట్టె వంటివి తయారు చేస్తూ ఉంటాం. వీటితోపాటుగా రాగి పిండితో మనం ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పిండితో చేసే ఉప్మా ఎంతో రుచిగా ఉంటుంది. సాధారణంగా చేసే ఉప్మాకు బదులుగా రాగి పిండితో చేసిన ఉప్మాను తినడం వల్ల ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. రాగి పిండితో ఉప్మా చేయడానికి కావలసిన పదార్థాలను, తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – ఒక కప్పు, ఉప్మా రవ్వ – ఒక కప్పు, నూనె- 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, ఉల్లి పాయ ముక్కలు – పావు కప్పు, పచ్చి మిర్చి – 2 (తరిగినవి) , పల్లీలు – 2 టీ స్పూన్స్, జీడి పప్పు – 2 టీ స్పూన్స్, క్యారెట్ తురుము – పావు కప్పు, కరి వేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – రుచికి తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – సరిపడా.
రాగి ఉప్మా తయారీ విధానం..
ముందుగా రాగి పిండిని, ఉప్మా రవ్వను వేయించి పెట్టుకోవాలి. తరువాత ఉప్మా చేయడానికి వీలుగా ఉండే పాత్రను తీసుకుని నూనె వేసుకోవాలి. నూనె కాగాక ఉప్పు, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలు అన్నీ వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగాక ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిని, ఉప్మా రవ్వను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోస్తూ, ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఉప్మా పై కొత్తి మీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి ఉప్మా తయారవుతుంది. దీనిని టమాట చట్నీ, పల్లీ చట్నీలతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. రాగి జావని ఇష్టపడని వారు రాగి పిండితో ఇలా ఉప్మాను చేసుకోవడం వల్ల రుచితోపాటుగా రాగులలో ఉండే పోషకాలన్నీ శరీరానికి లభిస్తాయి.