Dry Ginger : మనం వంటల్లో ఎక్కువగా అల్లాన్ని వాడుతూ ఉంటాం. అల్లాన్ని ఎండ బెట్టి, పొడిగా చేసి కూడా వాడవచ్చు. ఈ పొడినే శొంఠి పొడి అంటారు. శొంఠి పొడిని మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అల్లంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శొంఠి పొడిలో నీటి శాతం ఉండదు. కనుక ఒక టీ స్పూన్ అల్లాన్ని వాడడానికి బదులుగా అర టీ స్పూన్ శొంఠి పొడిని వాడవచ్చు. శొంఠి పొడిని వాడడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
మనం అన్నాన్ని తినేటప్పుడు మొదటి రెండు ముద్దలల్లో శొంఠి పొడిని, నెయ్యిని వేసి కలిపి తినడం వల్ల అజీర్తి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా 4 నుండి 5 రోజులు చేయడం వల్ల జీర్ణ శక్తి పెరిగి, ఆకలి పెరుగుతుంది. ఇందులో ఉండే జింజిరాల్ అనే రసాయనం జీర్ణ శక్తిని పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిల్లలల్లో ఆకలిని పెంచడానికి సిరప్ లను వాడడానికి బదులుగా ఇలా శొంఠి పొడిని వాడడం వల్ల జీర్ణశక్తి పెరగడంతోపాటు జీర్ణాశయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
గర్భిణీలలో వికారం, వాంతులు ఎక్కువగా అవ్వడం వంటి లక్షణాలను మనం చూడవచ్చు. అలాగే కొందరిలో అజీర్తి కారణంగా వాంతులు అవ్వడాన్ని మనం గమనించవచ్చు. అలాంటి వారు ఒక టీ స్పూన్ శొంఠి పొడిలో రెండు టీ స్పూన్ల తేనెను వేసి కలిపి 10 నిమిషాల పాటు కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి.
శొంఠి పొడిలో ఉండే జింజిరాల్ అనే రసాయనం వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జలుబు, దగ్గు, ముక్కు కారడం వంటి వాటిని తగ్గించడంలో హాయపడుతుంది. శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వును (ఎల్‌డిఎల్), ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించడంలో కూడా శొంఠి పొడి సహాయపడుతుంది. రోజుకి 2 నుండి 3 గ్రా. ల శొంఠి పొడిని 45 రోజుల పాటు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు, ట్రై గ్లిజరైడ్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
శొంఠి పొడిని వాడడం వల్ల శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కరగడమే కాకుండా తిన్న ఆహార పదార్థాలు త్వరగా కొవ్వులాగా మారకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా శొంఠి పొడి ఎంతో సహాయపడుతుంది. శొంఠి పొడిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని వారు చెబుతున్నారు.