Broken Rice : పూర్వ కాలంలో బియ్యం వాడకం చాలా తక్కువగా ఉండేది. బియ్యం వాడకానికి బదులుగా చిరు ధాన్యాలతోపాటు నూకలను కూడా ఎక్కువగా వాడేవారు. నూకలు మనందరికి తెలిసినవే. వడ్లను బియ్యంగా మార్చే ప్రక్రియలో కొన్ని బియ్యం విరిగి చిన్న చిన్న ముక్కలుగా తయారవుతాయి. బియ్యాన్ని జల్లెడ పట్టినప్పుడు విరిగిన బియ్యం వేరుగా అవుతాయి. వీటినే నూకలు అంటారు. ప్రస్తుత కాలంలో నూకలను అన్నంగా వండుకుని తినే వారు చాలా తక్కువగా ఉన్నారు. నూకలను వండుకుని కొత్త ఆవకాయ, నెయ్యి వేసుకుని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
నూకలు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నూకలు పరిమాణంలో చిన్నగా ఉన్న కారణంగా మెత్తగా, త్వరగా ఉడికిపోతాయి. అరుగుదల శక్తి తక్కువగా ఉన్న వారు, అజీర్తి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఉన్న వారు నూకలను కొద్దిగా వేయించి అన్నంగా వండుకుని తినడం వల్ల లేదా మరింత పలుచగా జావలా చేసి తాగడం వల్ల త్వరగా జీర్ణమై ఈ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
జ్వరం లేదా ఇతరత్రా అనారోగ్య సమస్యలు వచ్చి తగ్గిన తరువాత నేరుగా అన్నం తినడానికి బదులుగా నూకలను జావగా చేసి, కొద్దిగా పెరుగును కలిపి తాగించవచ్చు. బియ్యం నూకలే కాకుండా గోధుమలు, ఇతరత్రా చిరు ధాన్యాల నూకలను కూడా ఇలా జావగా చేసుకుని తాగవచ్చు. పది నెలలు లేదా సంవత్సరం వయస్సు ఉన్న చిన్న పిల్లలకు అన్నాన్ని మెత్తగా చేసి పెట్టడం కంటే నూకలతో వండిన అన్నాన్ని పెట్టడం వల్ల త్వరగా జీర్ణమై అజీర్తి వల్ల కలిగే కడుపు నొప్పి , మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
నూకల అన్నాన్ని ఎక్కువగా నమిలే అవసరం ఉండదు. కనుక దంతాలు లేని పెద్దవారికి కూడా నూకల అన్నాన్ని ఆహారంగా ఇవ్వవచ్చు. జీర్ణ శక్తి తక్కువగా ఉండే వారి మలంలో అన్నం అలాగే మెతుకులుగా ఉండడాన్ని, పొట్టలో గ్యాస్ వంటి సమస్యలతో బాధపడడాన్ని మనం గమనించవచ్చు. అలాంటి వారు నూకల అన్నాన్ని తినడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నూకలతో వండిన అన్నంలో నిల్వ పచళ్లను, వెన్నను కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.